ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్
ఎర్రచందనం, ఇసుక అక్రమ రవాణా, నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపి అరికట్టాలని పీడి యాక్ట్‌లు ప్రయోగించేందుకు వెనకాడవద్దని నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్‌పి రిషాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పోలీస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు నెల వారీ నేర సమీక్షా కార్యక్రమము మంగళవారం జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'స్పందన' కార్యక్రమం గురించి వివరిస్తూ ప్రతి సోమవారం నిర్వహింపబడు ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులు, విన్నపాలను నిర్దేశించిన కాల వ్యవధిలో పరిష్కరించాలని ఫిర్యాదు దారుల పట్ల గౌరవంగా, మర్యాదగా మసలు కోవాలని, మన ప్రవర్తన ఆదర్శనీయంగా వుండాలని, స్టేషన్ పరిసరాలను శుభ్రంగా వుంచుకోవాలని ఆదేశించినారు.
కేసులను త్వరిత గతిలో నేర పరిశోధన చేసి పరిష్కరించవలసినదిగా ఆదేశించారు. ఎస్సీ/ఎస్టీ కేసుల్లో పురోగతిపై సమీక్ష చేశారు. జిల్లా లోని వివిధ స్టేషన్ లలో పలు కేసులలో స్వాధీనం చేసుకొన్న వాహనాలు పేరుకుని పోయి ఉన్నాయని వాటిని త్వరిత గతిన క్లియర్ చేయాలని ఆదేశించారు. రాష్ట్రం లో సంచలనం సష్టిస్తున్న లోన్ యాప్ ఆగడాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలు వాటి ఊబిలో పడకుండ లోన్ యాప్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు. పక్క రాష్ట్రాల నుండి మద్యం రవాణాపై ప్రతేక బందాలతో నిఘా పెట్టామని, జిల్లాలోని నాటుసారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, పోలీసు బందాలతో మెరుపు దాడులు చేసి మూలాలతో పెకిలించే ప్రయత్నం చేయాలని, నిఘా, సమాచార వ్యవస్థను పటిష్ట పరిచి, వాహనాల తనిఖీలు ఉధృతం చేయాలన్నారు. అడిషనల్ ఎస్.పి. అడ్మిన్ పి.జగదీష్, అడిషనల్ ఎస్.పి. ఆపరేషన్స్ శ్రీనివాస రావు, ఎస్.బి. డి.ఎస్.పి. శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.










