ప్రజాశక్తి-శింగనమల కూలి పనులకు వెళ్తూ.. కష్టపడి పిహెచ్‌డి పట్టా సాధించిన డాక్టర్ సాకే భారతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని నాగలగుడ్డం గ్రామానికి చేరుకుని సాకే భారతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారసురాలిగా సాకే భారతి కూలి పనులు చేస్తూ, భర్త సహకారంతో రసాయన శాస్త్రంలో పిహెచ్‌డి పట్టా సాధించడం సంతోషకరమన్నారు. అనేక కష్టాలకోర్చితేనే ఈ విజయం వరించిందన్నారు. భారతి కుటుంబ పరిస్థితిని చూస్తే చాలా దయనీయంగా ఉందన్నారు. ఆఖరికి పూర్తిస్థాయిలో ఇళ్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. పిహెచ్‌డి పట్టా తీసుకున్నా ఉపాధి లేకపోవడం వల్ల భారతి, తన భర్త శివప్రసాద్ రోజూ కూలి పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈనేపథ్యంలో భారతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాజకీయాలను పక్కన పెట్టి ఐదెకరాల భూమి, అసంపూర్తిగా ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, భర్తకు పాడి పరిశ్రమ ఏర్పాటు చేసుకునేందుకు రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు జి.వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ఎర్రస్వామి, జిల్లా సహాయ కార్యదర్శి రాజా, జిల్లా నాయకులు జీవరత్నం, అక్కులప్ప, అనిల్, తదితరులు పాల్గొన్నారు.
భారతిని సన్మానిస్తున్న కెవిపిఎస్‌నాయకులు










