Oct 12,2023 21:36

బూర్జ పిఎసిఎస్‌ భవనం

* సొసైటీకి జమ కాని రుణాల సొమ్ము
* రూ.20 లక్షల వరకు ఉంటుందని అధికారుల గుర్తింపు
* రూ.కోటి పైబడి ఉంటుందని ప్రచారం
* బూర్జ పిఎసిఎస్‌లో అవకతవకల బాగోతం
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, బూర్జ :
అధిక వడ్డీలు, ప్రయివేట్‌ వడ్డీ వ్యాపారుల బెడద నుంచి రైతులను రక్షించాలన్నది ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పిఎసిఎస్‌) ప్రధాన లక్ష్యం. రైతులకు రుణాల మంజూరు, వాటిని తిరిగి కట్టించుకునే విషయంలో కొన్నిచోట్ల జరుగుతున్న అవకతవకలు సంఘాల ప్రతిష్టనే దెబ్బతీస్తున్నాయి. రుణాలు ఇవ్వకుండానే రైతులకు నోటీసులు... వాయిదా సొమ్ములు చెల్లించినా, తిరిగి కట్టాలంటూ నోటీసులు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. బూర్జ మండలంలోని బూర్జ పిఎసిఎస్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు ఉదాహరణ. రైతుల రుణాల పేరిట లక్షలాది రూపాయల సొమ్ము పక్కదారి పట్టినట్లు తీవ్ర చర్చ సాగుతోంది. రుణాల సొమ్ము జమ కాని వైనంపై క్షేత్రస్థాయిలో 'ప్రజాశక్తి' పరిశీలనలో వెలుగు చూసింది.
బూర్జ పిఎసిఎస్‌ పరిధిలో 4,400 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో ప్రతి ఏడాది 3,500 వరకు పంట రుణాలు పొందుతున్నారు. ప్రతి ఏడాది ఈ సొసైటీ పరిధిలో రూ.13 కోట్ల వరకు టర్నోవర్‌ ఉంది. 2014-15 వరకు ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరిగినా, ఆ తర్వాత మాత్రం గాడి తప్పిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల రైతులకు జారీ చేస్తున్న నోటీసులతో సొసైటీలో జరుగుతున్న అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. రైతులు తాము తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించినా, కట్టలేదంటూ కొందరికి నోటీసులు ఇస్తున్నారు. వడ్డీ సొమ్ము చెల్లించలేదంటూ మరికొందరికి నోటీసులు ఇస్తున్నారు. రుణాలు తీసుకోని వారికి సైతం నోటీసులు ఇస్తుండడంతో వారు విస్తుపోతున్నారు. నోటీసులు అందుకుంటున్న రైతులు పిఎసిఎస్‌కు పరుగులు తీస్తున్నారు.
అవకతవకలకు ఉదాహరణలు ఇవే...
బూర్జ మండల కేంద్రానికి చెందిన సిహెచ్‌.కృష్ణమోహన్‌ 2020లో పంట ఖర్చుల కోసం రూ.20 వేలు రుణం తీసుకున్నారు. ఏడాదికోసారి రూ.1500 చొప్పున వడ్డీ చెల్లిస్తున్నారు. సకాలంలో వడ్డీ కడుతున్నా, అయన పేరుతో రూ.37 వేలు అప్పుగా రికార్డుల్లో ఉంది. అదే ప్రాంతానికి చెందిన సర్పంచ్‌, సొసైటీ మాజీ డైరెక్టర్‌ గంగు అప్పారావు రూ.10 వేలు, గంగు రవి రూ.60 వేలు, అదే కుటుంబానికి చెందిన గంగు భారతి రూ.60 వేలు 2017-18లో తీసుకున్నారు. అసలు, వడ్డీ కలిపి రూ.1.80 లక్షలు చెల్లించారు. అయినా మీరు రూ.20 వేలు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడంతో వీరు ఆశ్చర్యపోతున్నారు. ఉవ్వపేటకు చెందిన పోతిన భాస్కరరావు 2018-19లో రూ.1,51,975 అప్పు తీసుకుని ప్రతి ఏడాది రూ.25 వేలు చెల్లిస్తున్నా, అసలుతో పాటు 5,829లు బకాయి పడినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. పోతిన శ్రీనివాసరావు రూ.21,523 అప్పు తీసుకోగా, అప్పుతో పాటు రూ.826 వడ్డీ చెల్లించాలని పేర్కొన్నారు. బొల్లి చిన్నమ్మడు రూ90,760 రుణంతో పాటు రూ.3,480 చెల్లించాలన్నట్లుగా నోటీసులు ఇచ్చారు.
రూ.21 వేలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు
నేను, మా కుటుంబసభ్యులు కలిసి పంట కోసం రుణం తీసుకున్నాం. అసలు, వడ్డీ అంతా కలిపి చెల్లించినా డబ్బులు కట్టాలంటూ నోటీసులు ఇచ్చారు. సొసైటీలో మా పేరుతో ఉన్న అప్పుకు, మేం చెల్లించిన సొమ్ముకు రూ.21 వేలు తేడా కనిపిస్తోంది. అంతా కట్టేసిన తర్వాత మా పేరుతో అప్పు ఎందుకు చూపిస్తున్నారో అడగడానికి సొసైటీకి వచ్చాను.
- ఫణుకు గంగాధర్‌, చిన్నకురుంపేట
వడ్డీ చెల్లించినా కట్టాలంటున్నారు

నేను పంట ఖర్చుల కోసం 2015-16లో రూ.43 వేలు రుణం తీసుకున్నాను. ప్రతి ఏడాది వడ్డీ సొమ్ము చెల్లిస్తున్నాను. అయినా వడ్డీ డబ్బులు రూ.తొమ్మిది వేలు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు.
- బొల్లి పాపారావు, ఉవ్వపేట
సొసైటీలో అవకతవకలు గుర్తించాం

సొసైటీలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రతి రైతు ఖాతానూ పరిశీలిస్తున్నాం. ఇప్పటివరకు సుమారు రూ.20 లక్షల వరకు పక్కదారి పట్టినట్లు ప్రాథమికంగా గుర్తించాం. డబ్బులు చెల్లించినట్లు రైతులు చెప్తున్నారు. అందుకు సంబంధించిన రశీదులు చూపిస్తే, వారు తిరిగి కట్టనవసరం లేదు.
- డి.వరప్రసాద్‌, సిఇఒ, డిసిసిబి