May 20,2023 22:29

పిడుగుపాటుతో మృతి చెందిన నారాయణరెడ్డి

            రాయదుర్గం : పిడుగుపాటుకు వ్యక్తి మతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... డి.హిరేహాల్‌ మండలం ఎం.హనుమాపురం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(48) రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీబజార్లో నివసిస్తున్నాడు. ఆయన జక్కలఒడికి గ్రామానికి చెందిన వెంకటేశులు, మరో వ్యక్తి బలరాంతో కలిసి శనివారం 4 గంటల సమయంలో ఓ చింత చెట్టు వద్ద కూర్చుని భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం కురిసింది. దీంతో భోజనం చేస్తున్న నారాయణరెడ్డి, వెంకటేశులు అక్కడున్న చింత చెట్టుకు ఆనుకుని నిలబడ్డారు. మరో వ్యక్తి బలరాం, కొంతనపల్లి గ్రామానికి చెందిన మరో యువకుడు కాస్త దూరంగా నిలబడ్డారు. ఒక్కసారిగా పిడుగు చింతచెట్టుపై పడింది. దీంతో దాని కింద ఉన్న నారాయణరెడ్డి, వెంకటేశులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు నారాయణరెడ్డి అప్పటికే మతి చెందినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యకోసం తరలించారు.