పిడియాట్రిక్ వార్డులో వెంటిలేటర్ల ఏర్పాటుకు చర్యలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో అనేక సంస్కరణలు చేపట్టి ప్రజలకు సత్వరమే వైద్యసేవలు అందించేందుకు అనేకచర్యలు చేపడుతున్నదని, ఈసేవలను ప్రజలకు సకాలంలో అందించేందుకు వైద్యఆరోగ్యశాఖ పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ తెలిపారు. శనివారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో 2022 ఏప్రిల్ నుండి 2022 డిసెంబర్ వరకు జరిగిన ప్రసూతి మరణాలకు సంబంధించి సంబంధిత మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎం, ఆశా, అంగన్వాడీ వర్కర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా వైద్యసేవలను విస్తతం చేసేందుకు అనేక సంస్కరణలను చేపట్టిందని, ఈ సంస్కరణలన్నింటినీ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా చేసే అంశంలో డాక్టర్లు, ఆశా, ఏఎన్‌ఎం అంగన్వాడీ వర్కర్, ఇలా ప్రతిఒక్కరు కీలకపాత్ర పోషిస్తారని వీరందరూ తమ విధులను మరింత బాధ్యతగా నిర్వర్తించడం ద్వారా ప్రసూతి మరణాలను నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రసూతి మరణాలు జరగకుండా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో గర్భం దాల్చిన మహిళలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు, సుఖప్రసవం జరిగేలా చూడాలన్నారు. హైరిస్క్ గర్భవతులపై మరింత శ్రద్ధ చూపాలని సూచించారు. చిత్తూరు జిల్లా ప్రధాన ఆస్పత్రిలో పీడీ యాట్రిక్ వార్డులో వెంటిలేటర్లు లేదనే విషయం సమావేశంలో కలెక్టర్ దష్టికి తీసుకురాగా వెంటనే ఈవార్డులో వెంటిలేటర్ల ఏర్పాటు చేయాలని డిసిహెచ్‌ఎస్‌ను కలెక్టర్ ఆదేశించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం అనే విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ విస్తతంగా ప్రచారం చేయాలన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలే అందించేలా క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎం ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన పెంపొందిం చాలన్నారు. జిల్లాలో మెటర్నల్ మొర్టాలిటి రేషియో (ఎంఎంఆర్) 35.5గా కలదని, ఇన్ఫాంట్ మొర్టాలిటిరేట్ 5.3గా కలదని, డిసిహెచ్ ఎస్‌డిఎం అండ్‌హెచ్‌ఓ డాక్టర్ ప్రకాశం కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో భాగంగా 15 ప్రసూతి మరణాలకు సంబంధించిన కేసుల వివరాలను సంబంధిత డాక్టర్, ఎఎన్‌ఎం, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలతో సమీక్షించారు. ఈసమావేశంలో డిసిహెచ్‌ఎస్ డాక్టర్ నాయక్, డిఐఓ డాక్టర్ రవిరాజు, డిపిఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు, మెడికల్ ఆఫీసర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.










