అనంతపురం కలెక్టరేట్ : సమాజంలో నాల్గవ స్తభంగా కొలిచే మీడియా రంగం పెట్టుబడిదారీ వ్యవస్థ కబంధ హస్తాల్లో చేరడం వల్ల సమాజానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు వక్తలు తెలిపారు. హిందూపత్రిక పాత్రికేయుడిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందిన సుసర్ల రమేష్‌కు బుధవారం నాడు విద్వాన్ విశ్వం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎన్జీవో హోంలో విద్వాన్ విశ్వం విజ్ఞాన కేంద్రం కన్వీనర్ ఏజీ.రాజమోహన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు, మానవ హక్కుల వేదిక చంద్రశేఖర్, డాక్టర్ కొండయ్య, హిందూ పత్రిక సీనియర్ పాత్రికేయుడు సుసర్ల రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, ఇన్‌టాక్ రామ్‌కుమార్, బోస్, బిజెపి నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం జర్నలిజం- సామాజిక బాధ్యతపై మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు మాట్లాడుతూ మీడియా సేవలపై ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉందన్నారు. సాంకేతికంగా అభివృద్ధి సాధించిన నేపథ్యంలో మీడియా రంగం కొలమానం లేని విధంగా వ్యాప్తి చెందిందన్నారు. ప్రస్తుతం వాస్తవాల కంటే నెగిటివ్ ఆలోచనలు రేకెంత్తించేలా మీడియా వ్యవస్థ తయారు కావడం బాధకారం అన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజాన్ని మార్చే శక్తి మీడియా రంగానికి ఉందన్నారు. మీడియా స్వేచ్చను కాపాడే ప్రభుత్వాలు ఉంటే సమాజానికి మేలు జరుగుతుందన్నారు. విద్వాన్ విశ్వం విజ్ఞాన కేంద్రం కన్వీనర్ ఏజీ.రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ అన్యాయాన్ని నిలదీసి సక్రమంగా వ్యవస్థలను నడిపే శక్తి మీడియాకు ఉందన్నారు. డాక్టర్ కొండయ్య మాట్లాడుతూ సమాజంలో ప్రజల పక్షాన మీడియా ముఖ్యపాత్ర పోషిస్తోందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ సమాజాన్ని తట్టి లేపే శక్తి జర్నలిజంకు ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీడియాలో కూడా మార్పులు వచ్చాయని తెలిపారు. సమాజాభివృద్ధిని కాంక్షించే పాత్రికేయులు ఎందరో ఉన్నారని, అలాంటి వారిలో రమేష్ నిలిచారన్నారు. రాయలసీమ వెనుకబాటుపై, పేదరికం, కార్మికుల శ్రమ దోపిడిని ఎత్తి చూపుతూ అనేక కథనాలు రాశారని అభినందించారు. బిజెపి నాయకులు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మీడియా పెట్టుబడి దారీ చేతుల్లోకి వెళ్లిందని, ఆయా సంస్థలు లాభాపేక్ష కోసమే పని చేస్తాయనడంలో సందేహం లేదన్నారు. సన్మాన గ్రహీత సుసర్ల రమేష్ మాట్లాడుతూ తాను పని చేసిన కాలంలో జిల్లాలో అనేక సమస్యలపై కథనాలు రాశానని, వాటిలో కొన్ని పరిష్కారం జరిగిందన్నారు. సామాజిక దృక్పథంతోనే ప్రస్తుతం పాత్రికేయులు పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్వాన్ విశ్వం విజ్ఞాన కేంద్రం జిల్లా నాయకులు ఎంఎన్‌టి.రాజు, శ్రీనివాసరావు, యుటిఎఫ్ సీనియర్ నాయకులు జిలాన్, మెడికల్ సేల్స్ రెప్రజెంటేటీవ్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మనోహర్, సురేంద్ర, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, సిపిఎం నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఆర్‌వి.నాయుడు, సిఐటియు నగర కార్యదర్శి వెంకటనారాయణ, రామాంజినేయులు, సురేష్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు సూర్యచంద్రయాదవ్, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.










