పెట్రోలు, డీజిల్‌కు బిజెపి 'పోటు'
ధరలు విపరీతంగా పెంచేసిన మోడీ
రూ.69 నుంచి రూ.115లకు పెరిగిన వైనం
సరిహద్దు బంకుల్లో విక్రయాలు శూన్యం
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
బిజెపి ఆధ్వర్యంలోని మోడీ అధికారంలోకి వచ్చాక పెట్రో బాదుడు విపరీతంగా పెరిగిపోయింది. రూ.69 నుంచి ఏకంగా రూ.115కు చేరింది. దీంతో సామాన్యులు అల్లాడుతున్నారు. వేల కోట్ల రూపాయలు జిల్లా వాసులపైన భారం పడింది. దీని ప్రభావం నిత్యావసర వస్తువుల పైనా కనిపిస్తోంది. పెట్రో ధరలను జనం మోయలేకపోతున్నారు.
బండి బయటకు తీయాలంటేనే వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోలు, డీజిల్‌ను జిఎస్‌టి పరిధిలోకి తీసుకువాలని, దీనివల్ల ధరలు తగ్గుతాయని డిమాండు ఉన్నా బిజెపి ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. సరిహద్దు పెట్రోల్ బంకుల్లో వ్యాట్ ప్రభావం వల్ల పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో బండులను లోడ్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దు బంకులు మూతబడుతున్నాయి.
మోడీ ప్రభుత్వ పాలనలో జిల్లాలో వాహనదారులకు ఇందన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బిజెపి అధికారంలోకి వచ్చాక వీటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మన జిల్లాలో 302 పెట్రోలు బంకులున్నాయి. ఇక్కడ సగటున రోజుకు 14.02 లక్షల లీటర్ల పెట్రోలు, 23.05 లక్షల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నట్లు ఆయిల్ కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు.
రోజు వారీ ధరల పెంపు
బిజెపి అధికారంలోకి రాకముందు పెట్రోలు, డీజల్ ధరల తగ్గింపు లేదా పెంపు అనేది రెండు, మూడు నెలలకు ఒక సారి జరిగేది. అయితే ప్రస్తుతం బిజెపి ప్రజలను నుండి డబ్బులు పిండడమే లక్ష్యంగా రోజూ ధరలు నిర్ణయించే పద్ధతిని తీసుకొచ్చింది. బంగారం లాగా దీనికీ రోజువారీ ధరను నిర్ణయించారు. ఇలా నిర్ణయించిన తరువాత ప్రతి రోజూ పెరుగుతూ పోయి సెంచరీ దాటేసింది. ఏదైనా రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తే తప్ప బిజెపి ఆ ధరలను స్థిరంగా ఉంచే పరిస్థితి లేకుండా పోయింది.
సుంకం బాదుడు
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి లీటర్ పెట్రోలుపై ఎక్సైజ్ సుంకం రూ.9.48 ఉండేది. అలాగే డీజిల్‌పై రూ.3.56 ఉంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడంతో ఆ ప్రయోజనాన్ని ప్రజలకు బదిలీ చేయకుండా 2014 నుంచి 2016 మధ్య కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సార్లు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీంతో 2014-15లో చమురు ద్వారా కేంద్రానికి వచ్చే ఆదాయం రూ.99వేల కోట్ల నుంచి 2016-17 నాటికి రూ.2.42 లక్షల కోట్లకు పెరిగింది. 2017లో ఓ సారి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినట్లే తగ్గించిన కేంద్రం 2019లో మళ్లీ పెంచింది. 2020 మార్చిలో పెట్రోలు, డీజిల్‌పై రూ.3 చొప్పున, 2020మే నెలలో పెట్రోలుపై రూ.10, డీజల్‌పైన రూ.13 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం సుంకాన్ని తగ్గించకుండా, రోడ్డు సెస్‌ను కూడా కలిపి వసూలు చేస్తోంది. ఇది వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లోని పెట్రోలు బంకులు మూతపడే పరిస్థితి నెలకుంది.










