Jul 15,2023 22:04

ప్రజాశక్తి - యలమంచిలి
          మండలంలోని చించినాడ గ్రామంలో పెరుగులంక భూముల కోసం పోరాటం చేసి పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్న రాపాక బొజ్జమ్మ, పల్లేరు శ్రీనివాస్‌, ముసుకూడి రాజు, కేత వాసులకు టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.లక్ష పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు చేతులమీదుగా అందించారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ అనేక ఏళ్లుగా పేదల ఆధీనంలో ఉన్న పెరుగులంక భూముల్లోని మట్టిని వైసిపి నాయకులు అక్రమంగా తరలించుకుపోవడాన్ని చించినాడ గ్రామంలోని పేదలంతా అడ్డుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల దమన కాండలో అనేకమంది గాయ పడ్డారని గుర్తు చేశారు. ఎవరైతే గాయపడి పోలీసుల కేసులు ఎదుర్కొంటున్నారో వారందరికీ రానున్న టిడిపి ప్రభుత్వం హయాంలో ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్‌రావు, టిడిపి నాయకులు పెచ్చెట్టి బాబు, రత్నం రాజు, చిట్టూరి రామాంజనేయులు, పీతల శ్రీనివాస్‌, కొండేటి నరేష్‌, కొండేటి జీవరత్నం పాల్గొన్నారు.
కమ్యూనిస్టుల నిబద్ధత పలువురికి ఆదర్శం
కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై ఎంత నిబద్ధతతో పనిచేస్తారో చించినాడ పోరాటంలో తాను ప్రత్యక్షంగా చూశానని పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు అన్నారు. సాధారణ ప్రజలతో పాటు సిపిఎం గ్రామ ముఖ్య నాయకులు పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారన్నారు. వారందరికీ వాస్తవంగా ఆర్థిక సాయం చేయడానికి తమ అధినేత చంద్రబాబు ఆదేశించారని, కాని ప్రజల కోసం కుటుంబాలను సైతం పక్కనపెట్టి ప్రాణాలను పనంగా పెట్టి పోరాటం చేసే కమ్యూనిస్టు నాయకులు తమకు డబ్బులు ముఖ్యం కాదని, కేవలం ప్రజా సమస్యలు పరిష్కారమైతే సరిపోతుందని చెప్పి తాము ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చినా వారు మాత్రం సున్నితంగా తిరస్కరించారని చెప్పారు. కమ్యూనిస్టుల పట్ల ప్రజల్లో మంచి గుర్తింపు, గౌరవభావం పొందడానికి ఇదే నిదర్శనమన్నారు.