ఓటు వేస్తున్న దృశ్యం
పెరిగిన విద్యుత్ ఛార్జీలపై ప్రజా బ్యాలెట్
ప్రజాశక్తి-కావలి రూరల్ :వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెరిగిన కరెంటు ఛార్జీలపై గురువారం పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట ప్రజా బ్యాలెట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ బ్యాలెట్ ద్వారా మొత్తం 205 ఓట్లు పోల్ అయ్యాయి. పెరిగిన కరెంటు ఛార్జీలను వ్యతిరేకిస్తూ 204 ఓట్లు రాగ అనుకూలంగా ఒక ఓటు వేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య ,సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కరవధి భాస్కర్, నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఎంత బాగుందో ఈ ప్రజా బ్యాలెట్ ద్వారా తెలుస్తుందన్నారు. ఈ ప్రజా అభిప్రాయ సేకరణ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదని ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చాలా తీవ్రంగా కనబడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి ప్రజలకు పెద్దగా వరగబెట్టింది ఏమీ లేదన్నారు. పెంచిన కరెంటు ఛార్జీలు, అన్ని రకాల యూజర్ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సిపిఐ నాయకులు కొప్పర్తి నాగరాజు, బలిజేపల్లి వెంకటేశ్వర్లు, దమ్ము దుర్గా బాబు, సిపిఎం నాయకులు పసుపులేటి తిరుపాలు, జి మధుసూదన్ రావు, భోగిశెట్టి క్రిష్ణయ్య, వై.కష్ణమోహన్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వై.ఉదరు, డివైఎఫ్‌ఐ నాయకులు కె.చెన్నయ్య, నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.










