ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని టిడిపి నగర అధ్యక్షుడు మారుతికుమార్ గౌడ్ అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో పాతూరు పవర్ ఆఫీస్ కార్యాలయ ఆవరణంలో సోమవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి టిడిపి నగర అధ్యక్షులు మారుతికుమార్‌గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి సూరిపూటి రమణ తదితరులు హాజరై మాట్లాడుతూ వైసీపీ నాలుగేళ్ల కాలంలో ఇప్పటికే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారని, పేద మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి బొంద పెట్టాలని పేర్కొన్నారు. వైసిపి నాలుగేళ్ల పాలనలో చెత్త పన్ను, నీటి పన్ను, బస్సు ఛార్జీలు, గ్యాస్ ధరలు, పెట్రోలు ధరలు, నిత్యావసర సరుకుల ధరలు, ఇలా అన్ని ధరలు పెంచుకుంటూ పేద మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్నారని తెలిపారు. ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు సైకో ప్రభుత్వం పోవాలి. సైకిల్ ప్రభుత్వం రావాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిడిపి నగర మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ రెడ్డి, తెలుగు మహిళా అధికార ప్రతినిధి సంగ తేజస్విని, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి సుధాకర్ యాదవ్, మహిళా అధికార ప్రతినిధులు వసుందర, కృష్ణవేణి, రాష్ట్ర నాయకులు సిమెంటు పోలన్న, దళవాయి వెంకట నారాయణ, మారెప్ప, కూచి హరి, బంగి నాగ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు : పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని టిడిపి ఆధ్వర్యంలో స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. స్థానిక కన్యకా పరమేశ్వరి దేవాలయం నుంచి సబ్‌స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టి అక్కడ బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ శ్రీనివాసులు, శశాంక్‌బాబు, వెంకటనారాయణ సూర్యనారాయణ శ్రీనివాస్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, అక్కులన్న పూల ఓబులపతి, రాందాస్, ఆనంద్, రాజా, ఉమాపతి పాల్గొన్నారు.










