Jun 27,2023 21:43

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రసంగిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్‌

         అనంతపురం కలెక్టరేట్‌ : ''కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా విద్యుత్‌ ఛార్జీలను పెంచుతోంది. అన్ని వర్గాల ప్రజలపై ఈ భారాలు పడుతున్నాయి. వివిధ రూపాల్లో ప్రభుత్వాలు జనంపై బాదుడు భారాన్ని మోపుతున్నారు. ఈ చర్యలను ప్రజలందరూ ప్రతిఘటించాలి. పెంచిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించేంత వరకు పోరాటం సాగించాలి. లేకుంటే వచ్చే పదేళ్ల పాటు జనంపై విద్యుత్‌ భారాలు తప్పవు.'' అని వామపక్ష పార్టీల నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను ఉప సంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం నాడు అనంతపురం ఏపీ ఎన్జీవో హోంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు వి.రామిరెడ్డి, ఎన్‌.శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌, సిపిఐఎంఎల్‌ జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న, సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌యుసిఐ నాయకులు తబ్రేజ్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షపాతి ప్రభుత్వమంటూనే మెత్తగా భారాలు మోపుతోందన్నారు. ఎప్పుడో 20 పైసలు, 30 పైసలు చెల్లించలేదనే సాకులు చెబుతూ ఇప్పుడు మొత్తం కలిపి జనం నుంచి వసూలు చేసేలా విద్యుత్‌ ఛార్జీలు అమాంతం పెంచారన్నారు. 2013లో వినియోగించిన విద్యుత్‌కు ఇప్పుడు ఛార్జీలు చెల్లించాలనడం దుర్మార్గంగా ఉందన్నారు. వంద రూపాయలు బిల్లు వచ్చే సగటు వినియోగదారులకు ఈ నెల రూ.300కు పెంచి వసూలు చేశారన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుకూల కార్పొరేట్‌ దిగ్గజం అదానీ కంపెనీకి విద్యుత్‌ ఉత్పత్తి బాధ్యత అప్పగించి కోట్లాది రూపాయలు ప్రజలపై భారాలు మోపి దోపిడీ చేయిస్తోందన్నారు. వైసిపి ప్రభుత్వం కేంద్రంకు సాగిలపడి విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి, వైసిపి ఎన్నికల్లో అదానీ ద్వారా లబ్ధి పొందడానికి ప్రజలపై భారాలు మోపడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు తగ్గిస్తామని చెబుతున్నారని, దీనిపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. పాలకుల మోసాలపై ప్రజలు మేల్కోవాలని లేకపోతే 10 సంవత్సరాల పాటు విద్యుత్‌ అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌ మాట్లాడుతూ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టిడిపి ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీల పెంపుదలపై బాదుడే బాదుడు అంటూ ప్రజల వద్దకు వచ్చి ముద్దాడి ఓట్లు అడిగారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అధిక భారాలు మోపి పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. సర్‌ ఛార్జీలని, సర్దుబాటు అంటూ రకరకాల పేర్లతో విద్యుత్‌ బిల్లులు పెంచి ప్రజల నెత్తిన బండరాయి వేస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసి రైతుల మెడకు ఉరితాళ్లు వేయడానికి సిద్ధమయ్యారన్నారు. ఎస్సీ, ఎస్టీకు ఉచిత విద్యుత్‌ కూడా కనుమరగయ్యే ప్రమాదం ఉందన్నారు. అందులో భాగంగానే స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటుకు కుట్ర చేస్తున్నారని వివరించారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శి సి.పెద్దన్న మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీల పెంపు పేరుతో రూ.12,500 కోట్లు భారాలు మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యిందన్నారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో అదనపు భారాలు వేసేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. అదానీ తదితర కార్పొరేట్‌ కంపెనీలకు విద్యుత్‌ ఉత్పత్తి చేయించి వారి నుంచి అదనపు ధరలతో విద్యుత్‌ కొనుగోలు చేసి ఆ భారాలను ప్రజలపై మోపుతున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ విద్యుత్‌ పోరాటంలో పాల్గొంటే ఆయన కుమారుడు జగన్‌ మోహన్‌రెడ్డి విద్యుత్‌ భారాలను ప్రజలపై మోపడం శోచనీయం అన్నారు. సిపిఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం చెప్పిందే జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారని తెలిపారు. నిర్వీరామం లేకుండా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పోరాడితే బిజెపి ప్రభుత్వం వెనక్కి తగ్గి నల్ల చట్టాలు రద్దు చేసిందన్నారు. విద్యుత్‌ సంస్కరణలపై కూడా ఇదే రకమైన పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అధిక కరెంటు బిల్లులను చూపి సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. ఎస్‌యుసిఐ నాయకులు తబ్రేజ్‌ మాట్లాడుతూ ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపడం దుర్మార్గమైన చర్యన్నారు. ప్రజలకు ఆసరగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా భారాలను వేయడం సరికాదన్నారు. సిటిజన్‌ ఫోరం జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్‌ఛార్జీల పెంపుదలపై ఫోరం ఆధ్వర్యంలో పోరాటాలు, న్యాయస్థానం ఫిర్యాదు చేయడం వల్ల జిల్లాలో సర్‌ఛార్జీల వసూళ్ల ఆపారని గుర్తు చేశారు. ప్రభుత్వం విద్యుత్‌ వ్యాపారం చేస్తూ ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. సోలార్‌, విండ్‌ పవర్‌ ఉత్పత్తి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ దిశాగా ప్రోత్సహించకుండా కొనుగోలు చేస్తూ ఇలా ప్రజలపై భారాలు మోపడం సరికాదన్నారు. సమావేశం అనంతరం ఈ నెల 30న జిల్లా నియోజకవర్గం, మండల కేంద్రాల్లోని విద్యుత్‌ కార్యాలయాల వద్ద చేపట్టే నిరసనల్లో ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మన్నీల సర్పంచి త్రిలోక్‌నాథ్‌, సిపిఎం నాయకులు ముస్కిన్‌, ప్రకాష్‌, ఇర్ఫాన్‌, మసూద్‌, సిటిజన్‌ ఫోరం నాయకులు ఎజి.రాజమోహన్‌, సిపిఐ జిల్లా నాయకులు అల్లీపీరా, బంగారు బాషా, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.