Oct 16,2023 21:27

ధర్నా చేస్తున్న వామపక్షాల నాయకులు

* వామపక్ష నాయకుల డిమాండ్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ : 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్‌ ఛార్జీలు, స్మార్ట్‌ మీటర్లు రద్దు చేయాలని సిపిఎం, సిపిఐ జిల్లా కార్యదర్శులు డి.గోవిందరావు, బి.శ్రీరామ్మూర్తి డిమాండ్‌ చేశారు. ఇదే డిమాండ్‌పై నగరంలోని ఎపిఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యాన సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అధిక ధరలు, అదనపు భారాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే విద్యుత్‌ భారాలు వేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా విద్యుత్‌ ఛార్జీల పెంపు, శ్లాబులు మార్చి భారాలు మోపడం, ట్రూఅప్‌, ఇంధన, సర్‌ఛార్జీలు, కస్టమర్‌, ఫిక్స్‌డ్‌, సర్దుబాటు ఛార్జీలు, విద్యుత్‌ సుంకం పెంపు పేర్లతో రెట్టింపు భారాన్ని ప్రజలపై మోపిందని వివరించారు. బిల్లులు చెల్లించలేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారని, వ్యాపారాలు దెబ్బతింటున్నాయని, పరిశ్రమలు మూతపడుతున్నాయని, ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినెలా జమా ఖర్చులపై విచారణ లేకుండానే యూనిట్‌కు అదనంగా 40 పైసలు చొప్పున సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయడం దారుణమన్నారు. వడ్డీ పేరుతో మరో రూ.1500 కోట్లు రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ భారాలు మోపేందుకు విద్యుత్‌శాఖ చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే విధిస్తున్న సర్దుబాటు ఛార్జీల భారాలను రద్దు చేయాలని కోరారు.
ప్రజలపై భారాలను మోపే విధానాలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశిస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.లక్షల కోట్ల పన్ను రాయితీలు ఇస్తూ సామాన్యులపై భారాలు వేస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి అదానీ, అంబానీ ప్రయోజనాలు తప్ప సామాన్యుల ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేసి ఆదాయాలు రాబట్టాలని ఆదేశాలు జారీ చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయకపోతే అప్పులకు అనుమతి ఇచ్చేది లేదని బెదిరిస్తోందన్నారు. ఈ విధానాలను జగన్‌ ప్రభుత్వం వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తూ, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతోందని విమర్శించారు. ధర్నాలో వామపక్షాల నాయకులు కె.మోహనరావు, జి.సింహాచలం, పి.తేజేశ్వరరావు, జి.రామకృష్ణ, కె.అప్పారావు, టి.తిరుపతిరావు, గోవర్థన్‌, ఎల్‌.మహేష్‌, పి.గణేష్‌, ఎ.షణ్ముఖరావు, సిహెచ్‌.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.