ప్రజాశక్తి-పుట్లూరు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం మండల కేంద్రంలోని కార్యాలయంలో తహశీల్దార్ మోహన్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ మండలవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరిచారన్నారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.1,400 కోట్ల భారాన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో 2014 సంవత్సరం నుంచి యూనిట్‌కు 20 పైసలు చొప్పున అదనపు భారాన్ని వేస్తోందన్నారు. ఒకవైపు పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వివిధ రకాలు ఛార్జీల పేరుతో ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో సోలార్, గాలిమరల ద్వారా విద్యుత్ పెరుగుతోందని చెబుతూనే రైతుల పైన భారం వేయడం ఎంతవరకూ సమంజమని ప్రశ్నించారు. కార్పొరేటు సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పజెప్పడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రామాంజనేయులు, సహాయ కార్యదర్శి సూరి, మండల కమిటీ నాయకులు వెంకటచౌదరి, భాస్కర్‌రెడ్డి, పెద్దయ్య, పూలరంగడు, నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ మోహన్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు










