పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి
ప్రజాశక్తి-కావలి రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలని కోరుతూ సోమవారం సిపిఎం రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌డిఒ శీనా నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రూరల్ ఇన్‌ఛార్జి టి మాల్యాద్రి మాట్లాడుతూ కరెంట్ ఛార్జీల యూనిట్ ధర ఈ మధ్య భారీగా పెంచారని, అసలు ఛార్జీల కంటే కొసరఛార్జీల బిల్లులు ఎక్కువగా బనాయిస్తున్నారని విమర్శించారు. సామాన్యులపై అధిక భారాలు మోపుతున్న ఫిక్సిడ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో అధికంగా మామూలుగా కరెంటు వాడుకునే దానికన్నా బిల్లులు రెట్టింపు వస్తున్నాయని తెలిపారు. మామూలుగా రూ.200 వచ్చే బిల్లు రూ.400, రూ.300 వచ్చే బిల్లు రూ.600 వస్తుందని తెలిపారు. ఇది నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలో భాగంగా మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం అమలుకు పూనుకుంటుందని దుయ్యబట్టారు. కొత్తకొత్త పేర్లతో, పద్ధతులతో వినియోగదారులపై తీవ్ర భారాలు మోపుతున్నారన్నారు. దానికి తోడు స్మార్ట్ మీటర్లు పేరుతో ఇంటికి నెలకు రూ.120 చొప్పున 10 సంవత్సరాలు పాటు అదనంగా విధిస్తున్నారన్నారు. మీటరు నిర్వహణ ఖర్చులకు అదనపు ఛార్జీలు వస్తువులు చేస్తున్నారని తెలిపారు. సెల్‌ఫోన్‌కు ఎలా రీఛార్జ్ చేసుకుంటామో అలాగే కరెంటును రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ కరెంటు ఛార్జీలు పెంచే విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టి.మాలాద్రి సిపిఎం నాయకులు వేముల సీతారామయ్య, ఎం.రామకృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.










