పెంచిన ధరలు తగ్గించాలి : సిపిఎం
ప్రజాశక్తి-జలదంకి : ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సిపిఎం డిమాండ్ చేసింది. జిల్లా సమగ్ర అభివృద్ధిని కోరుతూ సిపిఎం తలపెట్టిన పాదయాత్ర ఆదివారం సాయంత్రం కలిగిరి నుండి జలదంకి మండలంలోకి ప్రవేశించింది. చిన్నక్రాక ఎస్‌సి కాలనీ సెంటర్లో కొనసాగిన పాదయాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు కూడా తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఎం తలపెట్టిన పాదయాత్రకు చిన్న క్రాకలో అపూర్వ ఆదరణ లభించింది. గ్రామంలో తిష్ట వేసిన పలు సమస్యల గురించి సిపిఎం నాయకులు దృష్టికి తీసుకువెళ్లారు. వినతి పత్రం కూడా అందజేశారు. తాగునీటికి తంటాలు పడుతున్నామని ఆవేదన వెలిబుచ్చారు. కాలువలు సైడ్ కాలువలు లేనందువలన రోడ్లపై మురుగుచేరి దుర్గంధం వెదజల్లుతుందని వాపోయారు. అనంతరం అక్కడనుండి బయల్దేరిన పాదయాత్ర బృందం 9వ మైలులో రాత్రికి బస చేసింది. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు శేషయ్య, రహనా బేగం, సిపిఎం సీనియర్ నాయకులు తాళ్లూరు మాల్యాద్రి, గ్రామ రైతు సంఘం నాయకులు వైద్యుల వెంకటస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ సభ్యులు వట్టికాల చంద్రయ్య, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.










