పెళ్లింట విషాదం
ఆస్పత్రిపాలైన అతిధులు
విందులో విషాహారం
బంధువులకు అస్వస్థత
వధూవరులు క్షేమం
ప్రజాశక్తి- ఎస్‌ఆర్ పురం:
పెళ్లి అనంతరం పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు ఎవరో ఒకరి ఇంటివద్ద విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఈపెళ్లి విందుకు బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి భోజనం చేసి సంతోషంగా వెళుత్తుంటారు. ఈ నేపథ్యంలో విందుకు వచ్చి భోజనం తిన్న బంధువులందరూ ఆసుపత్రి పాలైన సంఘటన ఎస్‌ఆర్ పురం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఎస్‌ఆర్‌పురం మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన జయమ్మ, రాజగోపాల్ నాయుడు కుమారుడు హిమం గంగాధర్‌కు నెల్లూరు మండలం ముక్కల్తూరు గ్రామానికి చెందిన సరళ బాలకష్ణనాయుడు కుమార్తె వీణకు ఈనెల 16వ తేదీ గురువారం చిత్తూరు కళ్యాణ మండపంలో బంధువుల సమక్షంలో వివాహం జరిగింది. శుక్రవారం పద్మాపురంలో పెళ్లి అనంతరం విందు ఏర్పాటు చేశారు. దీంతో బంధుమిత్రులు సుమారు వెయ్యిమంది వరకు భోజనాన్ని ఆరగించారు. కొంత సమయానికి కొందరికి వాంతులు-విరేచనాలు, మరి కొందరికి కడుపునొప్పి ప్రారంభమైంది. ఇది గమనించిన గ్రామస్తులు వారిని మండల కేంద్రమైన ఎస్‌ఆర్‌పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. సుమారు 250మందికి పైన అస్వస్థతకు గురయ్యారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొందరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి, పక్క రాష్ట్రమైన తమిళనాడులోని పల్లిపట్టు, నగిరి ఆసుపత్రులకు 108 వాహనం ద్వారా, ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి జిల్లా యంత్రాంగాన్ని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఎస్‌ఆర్‌పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని చికిత్స అందించారు. వీరిలో పది మంది మాత్రం తీవ్రఅస్వస్థతకు గురికావడంతో వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. నగిరి ఆర్టీవో సుజన జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రవిరాజు, జిల్లా అదనపు వైద్యాధికారి రమేష్, డాక్టర్ వాణి ఆరోగ్య కేంద్రంలో బాధితులకు అందుతున్న వైద్యసేవలను పర్యవేక్షించారు. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు అక్కడి చేరుకుని సేవ చేస్తున్నారు.
వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్
చిత్తూరు అర్బన్: ఎస్‌ఆర్ పురం మండలం పద్మాపురం గ్రామంలో ఒక పెళ్లి ఫంక్షన్‌లో భోజనం చేసిన కొంతమంది ప్రజలకు ఆరోగ్య సమస్యలు రావడంతో 45మందిని చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యబందం పరిశీలిస్తున్నదని వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైద్య బందానికి ఆదేశాలు ఇచ్చామని జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ తెలిపారు. పెళ్లి వేడుకలో భోజనం చేసిన వారిలో అడ్మిట్ అయిన వారిని జిల్లా కలెక్టర్ వార్డులలో పర్యటించి, వారి ఆరోగ్య స్థితిగతులను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డిసిహెచ్‌ఎస్ నాయక్, చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, చిత్తూరు ఆర్‌డిఓ రేణుకా, తహశీల్దార్ పార్వతి, అపోలో ఇన్‌ఛార్జి నరేష్ కుమార్‌రెడ్డి ఉన్నారు.










