పేదవాడి పొయ్యికి
బిజెపి మంట..!
రూ.1100కు పెరిగిపోయిన ధర
అల్లాడుతున్న సామాన్యులు
సబ్సిడీకీ మంగళం
తిరిగీ పాత పద్ధతికి మొగ్గు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
పేద, మధ్యతరగతి పొయ్యికి బిజెపి ధరల మంట పెట్టింది. అది అధికారంలోకి వచ్చాక గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. రూ.410ల నుంచి ఏకదాటిగా రూ.1100లకు చేరిపోయింది. దీనివల్ల పేద, మధ్యతరగతి వాసుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. వీటిని భరించలేక వారు అల్లాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగీ పొయ్యిల వైపే వెళుతున్నారు. ఇది ఇలా ఉంటే గ్యాస్ సబ్సీడీ కూడా వినియోగదారులకు రావడం లేదు.
రెండింతల పెరుగుదల..
మన జిల్లాలో 108గ్యాస్ ఏజెన్సీలున్నాయి. వీటిల్లో 10లక్షలకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా ఎంత లేదన్నా జిల్లాలో సుమారుగా నాలుగు నుంచి ఐదు లక్షల సిలిండర్లు వినియోగిస్తున్నారు. గ్యాస్ ధరలు మోడీ హయాంలో మోయలేని భారంగా మారింది. గత ఎనిమిదేళ్లలో ఎల్‌పీజీ సిలిండర్ ధర దాదాపు రెండు రెట్లు అయింది. 2014 మార్చి 1న కేవలం రూ.410లు మాత్రమే ఉన్న గ్యాస్‌రేట్ ఇవాళ రూ.1100లు దాటింది ఇది 14.2 కేజీల గహవసరాల సబ్సిడీ సిలిండర్ ధర మాత్రమే కావటం గమనార్హం. ఏడేళ్లలో పెరిగింది ఒక ఎతైతే, ఒక్క సంవత్సరంలోనే పెరిగింది మరో ఎత్తు.
2014లో రూ.413 ఉన్న వంట గ్యాస్ ధర 2015 డిసెంబర్‌కే రూ.600 దాటింది. 2016లో రూ.630కి, 2017లో రూ.646కి, 2018లో రూ.900కి చేరింది. 2019లో మాత్రం కొంచెం తగ్గింది. రూ.700కి దిగొచ్చింది. తర్వాతి సంవత్సరం (2020లో) 910, 2021లో రూ. 900 చిల్లర ఉంది. 2022 జూలై నాటికి ఏకంగా రూ.200 పెరిగి, రూ.1100కి చేరుకుంది. నాన్‌సబ్సిడీ సిలిండర్ ధర రూ.2000 దాటింది. మొన్నీమధ్యే కమర్షియల్ సిలిండర్ రేటను రూ.183. తగ్గించి ఊరటనిచ్చిన గ్యాస్ కంపెనీలు ఇవాళ సామాన్యులకు ఝలక్ ఇచ్చాయి.
సబ్సిడీకీ ఎసరు..
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎల్‌పీజీ ధర ఊహించని రీతిలో పెరిగిపోతుండటంతో సబ్సిడీ అంతకంతకూ తగ్గుతోంది. ఒకప్పుడు రూ.100, రూ.150 వరకూ కస్టమర్ ఖాతాలో పడే సబ్సిడీ డబ్బు ఇప్పుడు 20, 30 రూపాయలకే పరిమితమవుతోంది. ప్రస్తుతమైతే కేవలం రూ.15 మాత్రమే పడుతోంది. గ్యాస్ రేటు ప్రతి నెలా మారుతుండటంతో ఎప్పుడు ఎంత ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వీటితోపాటు కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకునేటప్పుడు చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ల రేట్లు సైతం ఇటీవల పెరిగాయి. గతంలో 14.2 కేజీల గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే రూ.1450 కడితే సరిపోయేది. ఇప్పుడు రూ.2200కి పెంచారు. దీనివల్ల అధికంగా రూ.750 ఇవ్వాలి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలంటే ఇంతకుముందు రూ.2550 ఇవ్వాల్సి ఉండగా ఇప్పుడు ఈ డిపాజిట్‌ని రూ.3600కి పెంచాయి. అంటే అదనంగా రూ.1050 కట్టాలి. 5 కేజీల సిలిండర్ కనెక్షన్ కోసం రూ.350 ఎక్కువ చెల్లించాలి. మోడీ అధికారంలోకి వచ్చాక సబ్సిడీ సిలిండర్ల పరిమితిని ఏడాదికి 12కే పరిమితం చేశారు. అంతకన్నా ఎక్కువ సిలిండర్లు బుక్ చేస్తే సబ్సిడీ వర్తించదు.
మోడీ హయాంలో ధరలు రెండింతలు
కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలోని బిజెపి అధికారంలోకి వచ్చాక గ్యాస్ ధరలు రెండింతలయ్యాయి. సామాన్యుడు పొయ్యి వెలింగిచాలంటేనే భయపడిపోతున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్లు బుక్ చేయడమే మానేస్తున్నారు. వెంటనే గ్యాస్ ధరలు తగ్గించాలి.










