అనంతపురం ప్రతినిధి : రెక్కడితేగాని డొక్కాడని పేద కుటుంబాలవి... అయితేనేమి మానవత్వంలో పెద్ద మనసు తమకుందని చాటుకున్నారు. బ్రెయిన్‌డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేసి తమ కుటుంబ సభ్యుడు చనిపోయినా మరో నలుగురికి జీవితాన్ని అందించిన వారమవుతామంటూ ఆ యువకుడి శరీర భాగాలను దానం చేశారు. ఈ ఘటన శుక్రవారం నాడు అనంతపురం నగరంలో చోటు చేసుకుంది.
బ్రెయిన్‌డెడ్ అయిన జగదీశ్ అవయవాలు దానం
బుక్కరాయసముద్రానికి చెందిన జగదీశ్(30)అనే యువకుడు తాపిమేస్త్రీ పని చేసుకుని జీవనం సాగించేవాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. తాపిమేస్త్రి పని చేయడం ద్వారానే కుటుంబ జీవాన్ని సాగించే వాడు. ఆగస్టు 1వ తేదీన కూడా ఈ పనికి వెళ్లి వస్తున్న సమయంలోనే అనంతపురం రూరల్ పరిధిలోని తడకలేరు వద్ద బైకు అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్రమైన గాయమైంది. తలలో తీవ్రమైన రక్తస్రావం కావడంతో బ్రెయిన్‌డెడ్ అయింది. జగదీశ్‌ను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు మొదట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సవేరా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయన్ను కాపాడేందుకు వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేదని తేలింది. బ్రెయిన్ డెడ్ అయిన కోలుకోలేని పరిస్థితి రావడంతో జీవన్‌దాన్ కింద అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.
గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు
కుటుంబ సభ్యులు అవయవ దానానికి అంగీకరించడంతో జగదీశ్ శరీరం నుంచి మూత్రపిండాలు, ఊపరితీత్తులు, కాలేయాలను సేకరించి ఇతరులకు అమర్చేందుకు సవేరా వైద్యులు ఉపక్రమించారు. మూత్రపిండాలు రెండింటిలో ఒకటి సవేరా ఆసుపత్రిలోనే ఆరోగ్యశ్రీ కింద ఒకరికి అమర్చారు. మరోకటి కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. కాలేయాన్ని విశాఖపట్నానికి, ఊపరితిత్తులను హైదరాబాద్‌కు తరలించారు. ఈ అవయవాలను గ్రీన్‌ఛానల్ ద్వారా అంటే ప్రత్యేకమైన అంబులెన్స్‌ల్లో కర్నూలు విమానాశ్రాయనికి తీసుకెళ్లి అక్కడి నుంచి వైజాగ్, హైదరాబాద్‌కు తరలించారు. ఇలా ఒక వ్యక్తి అవయవాలను నలుగురికి అమర్చేందుకు వీలుపడింది.
నాలుగోసారి తమ ఆసుపత్రి నుంచి ఇచ్చాం
హబీబ్ రాజా, మెడికల్ సూపరింటెండ్ సవేరా
బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల అవయవాదనం సవేరా ఆసుపత్రి నుంచి చేయడం ఇది నాలుగోసారి. జీవన్‌దాన్ కింద రిజిస్టర్డ్ అయిన ఆసుపత్రులు, అదే రకంగా రిజిస్టర్డు రోగులకు ఈ రకంగా బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను మరొకరికి అమర్చడం జరుగుతుంది.
ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతోనే
చంద్రశేఖర్, వైద్యులు సవేరా
జగదీశ్‌ను రక్షింంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాం. కాని ఫలితం లేకపోయింది. బ్రెయిన్‌డెడ్ కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు అవjవాలను సేకరించి మరొకరికి అమర్చేందుకు వేరువేరు ప్రాంతాలకు పంపించాం.
మరికొందరికైనా ఉపయోగపడాలనే ఈ నిర్ణయం
జగదీశ్ కుటుంబ సభ్యులు
జగదీశ్‌ను రక్షించేందుకు వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలూ చేశారు. కాని ఫలితం కనిపించలేదు. బ్రెయిన్‌డెడ్ అయినట్టు నిర్ధారించారు. ఈ క్రమంలోనే వైద్యులు, ఇతర అవయవదానం చేస్తే కొంత మందికైన జీవం పోయవచ్చునని చెప్పడంతో తమ కుటుంబ సభ్యులం అందరం చర్చించుకుని అవయవదానికి అంగీకరించాం. మా వాడి వలన మరో నలుగురి ఆరోగ్యాలు బాగుపడతాయన్న ఉద్ధేశ్యంతో దీనికి అంగీకరించాం.










