Mar 20,2022 22:33

పేదల పోరాటానికి మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు



మాన్యం భూమి అంటూ నోటీసులు
ఇళ్లు ఖాళీ చేయాలంటూ హుకుం
లబోదిబోమంటున్న ప్రజలు
పోరాటానికి అండగా పలుపార్టీలు


ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
కాలక్రమేనా తేనబండ నగరపాలక సంస్థలో వీలనమైంది. 22వ డివిజన్‌ తేనబండలో శ్రీనివాసపురంగా పేదలు ఉంటున్నా ప్రాంతం మారింది. 70 ఏళ్లుగా రిక్షా కార్మికులు, ఇంటిపనివారు, చిన్నచిన్న కూలీ పనులు చేసుకునే వారు తమ శక్తిమేరకు గుడిసెల స్థానం ఇళ్లు కట్టుకున్నారు. దీంతో 40కి పైగా ఇళ్లు వెయ్యికి పైగా ప్రజలు ఇక్కడే జీవిస్తున్నారు.
మాన్యం మంటలు
70 ఏళ్ల పాటు ఇండ్లు నిర్మించుకొని ప్రశాతంగా జీవనం సాగిస్తున్న శ్రీనివాసపురం ప్రజలకు అది ఎండోమెంట్‌ భూమి అని, ఇండ్లను కూల్చివేస్తామని, ఏప్రిల్‌ 10వ తేదీలోపు ఖాళీ చేయాలంటూ ఎండోమెంట్‌ కమిషనర్‌ నుంచి నోటీసులు అందాయి. దీంతో తాతలు, తండ్రులకాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని, ఎప్పుడు ఇది గుడిమాన్యం భూమి అని

ఏ అధికారి తమకు చెప్పలేదని, ఇప్పటికప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడిపోవాలని ఇదెక్కడి న్యాయమయ్యా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇళ్తు కూల్చేస్తామంటూ నోటీసులు..
తేనబండ ముత్యాలమ్మ గుడి దేవస్థానం సర్వే నెంబర్‌ 181 ఏసి 1.61 డికెటిలో ఇది ఇనాం డికెటిగా తెలుస్తోంది. ఈ స్థలం ముత్యాలమ్మ గుడికి చెందింగా ముత్యాలమ్మ గుడికి ఇటీవల ఛైర్మన్‌గా నియమితులైన యుగధర్‌రెడ్డి ఒత్తిడితో ఎండోమెంట్‌ ఈవో ఈనెల 10వ తేదీ ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీ చేసిన్నట్లు బాధితులు చెబుతున్నారు. గుడి ఛైర్మెన్‌, అతని బంధువులు, గుడి పూజారి కుట్రలు చేస్తూ పేదల ఇండ్లను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. 30రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలని లేకుంటే జేసిబి ద్వారా కూల్చివేస్తామంటూ బెదిరిస్తున్నారని, జేసిబి ఖర్చులు కూడా వారి వద్ద నుంచే వసూలు చేస్తామంటూ నోటీసులో పేర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేదల పోరాటానికి రాజకీయ పార్టీల అండ..
పేదల ఇండ్లను కూల్చివేస్తామంటూ ఎండోమెంట్‌ పంపిన నోటీలు వెన్నకుతీసుకోవాలంటూ ఆదివారం స్థానిక తేనబండలోని ధర్మరాజుల గుడివద్ద పేదలు నిరసన దీక్షకు పూనుకున్నారు. వీరి పోరాటానికి సిపిఎం, సిపిఐ నాయకులతో పాటు స్థానిక కార్పొరేటర్‌, కో ఆప్షన్‌ సభ్యులు మద్దతు ప్రకటించారు. చిత్తూరు ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు స్వయంగా ఆందోళనకారుల వద్దకు వచ్చి ఎండోమెంట్‌ కమిషనర్‌, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో చర్చించి పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రప్రభుత్వం పేదలకు ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం చేయదని,ఇళ్లు కూల్చేస్తారంటూ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని భరోసా ఇచ్చారు.
మాన్యం పేరుతో పేదల జోలికి రావద్దు
మాన్యం పేరుతో తరతరాలుగా ఇళ్లు నిర్మించుకున్న శ్రీనివాసపురం పేదలజోలికి రావద్దని సిపిఎం నగర కార్యదర్శి సురేంద్ర హెచ్చరించారు. అణగారిన పేదల ఇళ్లను నిలబెట్టుకోవడానికి ఎంతటి పోరాటానికైనా ప్రజలను కలుపుకొని ఉద్యమిస్తామన్నారు. అధికార పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, దళిత సంఘాలను ఐక్యం చేసుకుని పేదల ఇళ్లు కూల్చివేతకు వ్యతిరేకంగా పోరాడుతామని తెలిపారు.