Jul 20,2023 22:36

ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో మాట్లాడుతున్న రాజీవ్‌కాలనీ సిపిఎం నాయకులు

         ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌    రాజీవ్‌కాలనీ పంచాయతీలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు కరెంటు సౌకర్యం కల్పించి, విద్యుత్‌ మీటర్లు ఇవ్వాలని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం జగనన్న సురక్ష కార్యక్రమంలో అనంతపురం అర్భన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం మండల తహశీల్దార్‌ పేదలపై ధ్వేషం పెంచుకుని సంబంధిత కాలనీలో విద్యుత్‌ అధికారులకు కరెంటును సరఫరా నిలిపివేయాలని ఆదేశించడం దారుణంగా ఉందన్నారు. ఇప్పటికే తహశీల్దార్‌ కార్యాలయం దగ్గర అనేకసార్లు ఆందోళన చేసినప్పటికీ అధికారుల్లో ఏమాత్రం చలనం లేదని తెలిపారు. ఈ అధికారి పేదలకు ఒక న్యాయం ధనవంతులకు మరొక న్యాయం చేస్తున్నారని తెలిపారు. సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించి ఎమ్మెల్యే వెంటనే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని విద్యుత్‌ శాఖ డివిజినల్‌ ఇంజినీర్‌ను ఆదేశించారు. అలాగే పేదలకు విద్యుత్‌ మీటర్లు కూడా ఇవ్వాలని సూచించారు. దీంతో కాలనీవాసులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజీవ్‌కాలనీ ఉప సర్పంచి మసూద్‌, ఎంపిటిసి రమీజాబీ, సిపిఎం నాయకులు ప్రకాష్‌, బాబు, వలీ, శివ, మోహన్‌, లక్ష్మీనారాయణ, అశ్విని, వెంకటేశ్వరమ్మ, ఆచారి తదితరులు పాల్గొన్నారు.