ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ రాజీవ్‌కాలనీ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న పేద కుటుంబాలకు విద్యుత్ మీటర్లు ఇవ్వాలని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో గుత్తి రోడ్డులోని డీ6 పవర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నెలలుగా ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని తెలిపారు. వారికి కనీస సౌకర్యం విద్యుత్ సరఫరా కూడా లేదన్నారు. దొంగ కరెంటును వాడడం ఇష్టం లేదని ఇంటికి కరెంటు మీటర్లు ఇస్తే కరెంటు బిల్లులు చెల్లిస్తామని పేదలు విన్నవించుకుంటున్నా అధికారుల్లో చలనం లేనందన్నారు. అధికారులు స్పందించకపోవడంతో ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. అయితే లైన్‌మెన్ తదితర ఉద్యోగులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ, రాత్రి సమయాల్లో డిపీలు ఆఫ్ చేసి విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారని తెలిపారు. అక్కడ నివసిస్తున్న ప్రజలు విష సర్పాలు, తేళ్లు, పందులతో ఇబ్బందులు పడుతున్నారని, రాత్రి సమయాల్లో నివాసం ఉండడం కష్టంగా ఉందన్నారు. కావున అధికారులు పేదల పట్ల దయ ఉంచి విద్యుత్ మీటర్లు ఇవ్వాలని కోరారు. అనంతరం విద్యుత్ శాఖ ఏడితో ఫోన్‌లో సమస్యలు తెలుపగా కాలనీలో నివాసం ఉన్నా వారి చిరునామాలను సేకరించి మీటర్లు ఇస్తామని, విద్యుత్ సరఫరాను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు ప్రకాష్, మసూదు, వలీ, బాబు లక్ష్మీనారాయణ, వరలక్ష్మి, ఇస్మాయిల్, కార్పెంటర్ సీన, ఫాతిమా, మాబున్నీ తదితరులు పాల్గొన్నారు.
ఆందోళన చేస్తున్న సిఐటియు నాయకులు, ప్రజలు










