Jun 26,2023 22:47

నిరసన దీక్షా శిబిరం ముగింపుసభలో ఎంఎల్‌ఎ నిమ్మల, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం
ప్రజాశక్తి - యలమంచిలి

                మండలంలోని చించినాడ గ్రామంలో దళిత బలహీన వర్గాల్లోని అర్హులైన వారందరికీ డి ఫారం పట్టాలు సాధించేవరకు పోరాటం ఆగదని పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అన్నారు. లంక భూముల కోసం గత 20 రోజులుగా సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ముగింపు సభకు సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు అధ్యక్షత వహించగా ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మట్లాడారు. చించినాడ పెరుగులంక భూముల్లోని మట్టిని వైసిపి నాయకులు దౌర్జన్యంగా తరలించి ఏ విధంగా సొమ్ములు చేసుకున్నారో వారి బండారం ప్రజలందరికీ బట్టబయలు చేశామన్నారు. అనేక నెలల పాటు సాగిన లంకల పోరాటంలో వందలాది మంది పేదలు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా పోలీసులు దాడులను కూడా లెక్క చేయకుండా పోరాటంలో పాల్గొనడం వారి పోరాట స్ఫూర్తికి నిదర్శనమన్నారు. ఇదే పోరాటం లంక భూములను సాధించే వరకు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో లంక భూముల పోరాట కమిటీ సభ్యులు గొల్ల ఏడుకొండలు, చెల్లుబోయిన వడ్డీకాసులు, కేతా రాము, మురాల రాజేష్‌, మురాల జైసింగ్‌, ఎం.ఆంజనేయులు, ఎస్‌.భాస్కరరావు, ఎం.రాజు, కె.వెంకటేశ్వరరావు, బి.శంకరుడు, ఐద్వా నాయకులు పాల్గొన్నారు.