హిందూపురం : ఎంతో చరిత్ర కలిగిన హిందూపురం పురపాలక సంఘంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్‌తో పాటు ఇద్దరు వైస్ చైర్మెన్లు, 26 మంది అధికార పార్టీ కౌన్సిలర్లు, ఆరుగురు ప్రతిపక్ష టిడిపి, ఒక బిజెపి, ఒక ఎంఐఎం కౌన్సిలర్లు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇంత మంది ఉన్నప్పటికీ బడుగు బలహీన నిరుపేదల సమస్యల గురించి ఏ ఒక్క మున్సిపల్ సమావేశంలో మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రతి కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం... అజెండాను ఆమోదం చేసుకుని సమావేశాన్ని మమ అనిపించడం పరిపాటిగా మారింది. పట్టణంలో ప్రధాన వీధుల్లో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ రోడ్డును ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇళ్లు లేని పేదలు ఎక్కడైనా జానెడు స్థలంలో గుడిసెలు వేసుకుంటే అధికారులు క్షణాల్లో అక్కడికొచ్చి వాటిని తొలగించేస్తున్నారు. వ్యాపారులు, రాజకీయ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటున్నా మిన్నకుండిపోతున్నారు. హిందూపురం మున్సిపాల్టీ పరిధిలోని రహమత్‌పురం, ఆబాద్‌పేట, ముక్కిడిపేట హస్నాబాద్, మేళాపురం తదితర ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లను అధికారులు జెసిబిలతో ఇటీవల తొలగించారు. పేదల కాలనీల్లో పరిస్థితి ఇలా ఉంటే జన సముదాయాలు ఎక్కువగా ఉండే ప్రధాన రహదారుల్లో బడా వాణిజ్య సముదాయ భవనదారులు మురుగు కాలువలు, రోడ్లను ఆక్రమించుకుని నిర్మాణలు చేస్తున్నా వాటి వైపు అధికారులు కన్నెత్తి చూడటం లేదు.
పేదలపై ప్రతాపం..!
శ్రీ సత్యసాయి జిల్లాలోనే అతి పెద్ద పట్టణం హిందూపురం పురపాలక సంఘం. జిల్లాలోనే ఎక్కువ జనాభా కలిగిన పట్టణం సైతం ఇదే... ఇటీవల కాలంలో చిన్నచిన్న పురపాలక సంఘాల్లో సైతం ప్రత్యేక కార్యచరణ తీసుకుని ప్రధాన రహదారుల్లో ఉన్నటువంటి ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. అయితే హిందూపురం పురపాలక సంఘంలో దీనికి విరుద్ధంగా ఉంది. ఈ మున్సిపాల్టీలో పేదలపై ప్రతాపం చూపుతూ ఆక్రమణలంటూ వారి నిర్మాణాలను తొలగించేస్తున్నారు. పెద్దల భవనాల జోళికెళికి మాత్రం వెళ్లడంలేదు. జిల్లాలోని అతిపెద్ద మురికివాడ అయినా రహమత్‌పురంతో పాటు పేదలు నివాసముంటున్న ఆబాద్‌పేట, ముక్కడిపేట, హస్నాబాద్ తదితర ప్రాంతాల్లో మురుగు కాలువలపై చిన్న చిన్న స్నానపు గదులు నిర్మాణం చేసుకున్న వాటిని మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ అంటూ తొలగించారు. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత పేదల నిర్మాణాలపై మరింత కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. వార్డుల్లో ఎక్కడైనా చిన్నచిన్న ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే వెంటనే సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు అక్కడికి వాలిపోయి నోటీసులు ఇచ్చేస్తున్నారు. నిర్మాణానికి అనుమతులు లేవంటూ వెంటనే వాటిని ఆపించేస్తున్నారు. ఇది కేవలం పేదలు నిర్మించే చిన్నచిన్న ఇళ్ల నిర్మాణాలపై మాత్రమే జరుగుతోంది. పెద్దపెద్ద భవనాలు కళ్లేదుటే నిరభ్యంతరంగా నిర్మాణాలు జరిగిపోతున్నాయి.
యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు..!
హిందూపురంలో నిత్యం రద్దీగా ఉండే ఇందిరమ్మ సర్కిల్‌లో ఓ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇది అద్దెకు తీసుకున్న వారు మురుగు కాలువతో పాటు రోడ్డును సైతం ఆక్రమించుకున్నారు. దీని పక్కనే మారుతీ షాపింగ్ కాంప్లెక్స్, నూతనంగా నిర్మాణం చేసుకున్న బేకరీ షాప్ వారు కాలువలు, రోడ్డును ఆక్రమించుకున్నారు. ఇలా చెప్పుకుంటు పోతే పట్టణ పరిధిలోని బెంగళూరు రోడ్డు, పెనుకొండ రోడ్డు, ఆర్‌పిజిటి రోడ్డులో ఆక్రమణలు అనేకం కన్పిస్తాయి. వీటిపై మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడక పోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్‌పిజిటి రోడ్డులో ఒక ప్రముఖ వైద్యుడు తేజా నర్సింగ్ హోం పేరుతో రోడ్డును ఆక్రమించుకుని ఎటువంటి అనుమతులు లేకున్నా విధ్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ వారికి ఎటుఇంటి నోటీసులూ ఇవ్వలేదు. రహదారులను ఆక్రమించుకున్న వారు కౌన్సిలర్లకు సైతం మాముళ్లు ఇస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారు కౌన్సిల్ సమావేశంలో ఆ ఆక్రమణలపై చర్చించడం లేదన్న వాదనలు వినపిస్తున్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి పెద్దల ఆక్రమణలు తొలగించక పోతే పాలకులు, అధికారులు కలిసి పెద్దల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని తొలగించడం లేదన్న ఆరోపణలు అక్షర సత్యం అవుతుందని పురం ప్రజలు భావిస్తున్నారు.










