సిపిఎం ఆధ్వర్యాన ధర్నా
ప్రజాశక్తి - భీమవరం రూరల్
గరగపర్రు రోడ్డులో ఇళ్ల తొలగింపుల్లో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం వెంటనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జెఎన్‌వి.గోపాలన్ డిమాండ్ చేశారు. ఇళ్లు తొలగించిన ప్రాంతాన్ని సిపిఎం బృందం బుధవారం పరిశీలించింది. అనంతరం మున్సిపల్, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద పేదలతో కలిసి ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ సుమారు 70, 80 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న పేదల ఇళ్లను అధికారులు, పోలీసులు నిర్ధాక్షిణ్యంగా తొలగించారని మండిపడ్డారు. ఇళ్లను తొలగించకుండా హైకోర్టు నుండి స్టే తెచుకున్నప్పటికీ రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఏమాత్రం లెక్క చేయకుండా ఇళ్లను తొలగించారని విమర్శించారు. ఈ ప్రాంతంలో 50 ఇళ్లలో 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. 1996లో నాటి నర్సాపురం సబ్ కలెక్టర్ కృష్ణబాబు వీరందరికీ పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. వీరిలో అత్యధికులు దళితులు, ఇతర పేదలు ఉన్నారని తెలిపారు. ఇళ్లు తొలగించడంపై అధికారులకు ఉన్న ఉత్సాహం, వారికి ప్రత్యామ్నాయం చూపడంలో లేదని విమర్శించారు. ఇళ్లు కోల్పోయినవారికి టిడ్కో ఇళ్లను కేటాయించామని అధికారులు చెబుతున్నారన్నారు. టిడ్కో ఇళ్లు వాస్తవ లబ్ధిదారులు రాకపోవడం వల్ల వారి ఇళ్లను వీరికి కేటాయిస్తున్నామని అధికారులు చెబుతున్నారన్నారు. వాస్తవ లబ్ధిదారులు రాకపోవడానికి కూడా అక్కడ అనేక సమస్యలు ఉన్నాయన్నారు. రోడ్లు, తాగునీరు, డ్రెయిన్ వంటి అనేక మౌలిక సదుపాయాలు లేవన్నారు. దీనివల్ల వారు రాలేకపోయారన్నారు. అటువంటి ఇళ్లను వీరికి కేటాయించడంతో వాస్తవ లబ్ధిదారులు వస్తే వీరి మధ్య ఘర్షణ వచ్చే పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇళ్ల తొలగింపు ప్రక్రియ కొన్నేళ్లుగా సాగుతున్నప్పటికీ, ప్రభుత్వం ఏమాత్రం ముందు చూపు లేకుండా వీరిని రోడ్డున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలో రైల్వే అండర్ పాస్ రావడం వల్ల కొంత ప్రాంతం నిరుపయోగంగా ఉందన్నారు. ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లను తొలగించాల్సిన అవసరమే లేదన్నారు. అయినప్పటికీ అధికారులు అత్యుత్సాహానికి పోయి ఇళ్లను తొలగించారని విమర్శించారు. అవసరం లేని ఇళ్లను కూడా ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. అధికారులు ఎవరి ప్రయోజనాల కోసం ఇళ్లను తొలగించారని ఆయన మండిపడ్డారు. ఇళ్లను కోల్పోయిన వారికి ఇళ్లను కేటాయిస్తున్నామని చెబుతున్న అధికారులు పట్టాలు ఉన్న వారికి కూడా ఇళ్లను కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. పట్టాలు ఉన్నవారికి కూడా ఇళ్లను కేటాయించకపోతే అసలు అధికారులు ఏ ప్రాతిపదికన ఇళ్లను కేటాయిస్తున్నారని, ఇళ్లను కోల్పోయిన లబ్దిదారులను ఏ విధంగా గుర్తించారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాను కూడా పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టిన సర్వే మొత్తం అస్తవ్యస్తంగా ఉందని ఆయన విమర్శించారు. తొలగించిన ఇళ్లలో ఒక్కో దానిలో మూడు, నాలుగు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ఇప్పుడు టిడ్కో ఇళ్లను ఇచ్చి వాటిలో ఉండండి అని చెప్పడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఉండదన్నారు. నష్టపోయిన కుటుంబాలు ఎన్ని ఉంటే అందరికీ ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, లేదా టిడ్కో ఇళ్లను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఆర్‌డిఒ డి.రాజును కలిసి పేదల కష్టాలను వివరించారు. మున్సిపల్, ఇతర అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఆర్‌డిఒ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఎం.వైకుంఠరావు, డి.త్రిమూర్తులు, పట్టి శంకరం, రావడ మావుళ్లమ్మ, శేషం సింహాద్రి, ప్రసాద్, రమ్య, సుభాషిణి, లక్ష్మి, గుర్రమ్మ పాల్గొన్నారు.










