ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ సొంత ఇల్లు, స్థలాలు లేని నిరు పేదలందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం పేదలకు ఇళ్ల పట్టాలు, స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అనంతపురం తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఆవరణంలో బైటాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీ నగర్‌లో దాదాపు 300 కుటుంబాలు 20 సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని తెలిపారు. ఇప్పటి దాకా ఆ కాలనీవాసులకు అధికారులు పట్టాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఐదు ప్రభుత్వాలు మారినా నిరుపేదలకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు జాప్యం చేయడం దుర్మార్గం అన్నారు. రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో సిపిఎం ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని, వారికి స్థలాలు చూపించాలని ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. అధికారుల జాప్యంతోనే తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ స్థలాలను మాత్రం కొందరు కబ్జా చేసి వందల కోట్లు గడిస్తున్నారని తెలిపారు. పేదలు సెంటు భూమి ఇవ్వమంటే ప్రభుత్వం, అధికారులు ఎక్కడా లేని నిబంధనలు, చట్టాలు అమలు చేస్తారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలన్నారు. భూ కబ్జా చేస్తున్న పెద్దలపై కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 4-7 ఎ, 4-7బి, 4-8 ఎ, 4-8 బి ప్రభుత్వ భూమి పేదలకు పంచాలని కోరారు.
మండుటెండలోనే చంటి బిడ్డలతో మహిళల నిరసన
తమకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం చేపట్టిన ఆంధోళనలో భాగంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరై నిరసన తెలిపారు. చంటి బిడ్డల తల్లులు మండుటెండను సైతం లెక్క చేయకుండా అధికారులు, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. చంటి పిల్లలు ఏడుస్తుంటే ఆవరణంలోని చెట్లకు చీరలతో ఊయలలు కట్టి ఊపుతూ నిద్రపుచ్చారు. డిప్యూటీ తహశీల్దార్ రాజా వచ్చి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్వీకరించారు. తహశీల్దారు ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లారని, ప్రజా సమస్యలను తహశీల్దార్ ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి హామీలు అనేక మార్లు ఇచ్చారని, ఆచరణకు నోచుకోలేదన్నారు. కచ్చితమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. అధికారులతో మాట్లాడి శ్రీ శ్రీ నగర్‌కు సంబంధించి పట్టాలు ఈ నెల చివరి నాటికి ఇంటికే వచ్చి పట్టాలిస్తామన్నారు. రాజీవ్ కాలనీ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాలను సర్వే చేసి పేదలకు అందజేస్తామని మిగిలిన సమస్యలన్నీ దశలవారీగా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ముట్టడి కార్యక్రమాన్ని విరమించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వెంకటనారాయణ, ముస్కిన్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రకాష్, వలీ, మసూద్, బాబు, రాజు, గఫూర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి వెంకటేశు, ప్రసాదు, ఎన్టీఆర్ శీనా, ఎర్రిస్వామి, రజక వృత్తిదారుల సంఘం నాయకులు నాగభూషణం, సిపిఎం ఎంపిటిసి సభ్యురాలు రమీజాభీ, రాము, ఇస్మాయిల్, రామాంజి, షరీఫ్, పీరా, మోహన, లాలెమ్మ, మాబున్నీ, నవనీత తదితరులు పాల్గొన్నారు.










