అనంతపురం కలెక్టరేట్ : అత్యాధునిక వసతులు కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య సేవలు పేద ప్రజలకు మరింతగా చేరువ చేసి అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఎం.గౌతమి వైద్య సిబ్బందికి సూచించారు. మంగళవారం స్థానిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అభివృద్ధి సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత సేవలు ఎక్కువగా అందించగలిగితే ఆసుపత్రి ఆదాయం పెరుగుతుందని, తద్వారా సొంతంగా ఆసుపత్రి అభివద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. గర్భిణులకు ఉచిత ప్రసవాల సంఖ్య పెంచే అవకాశం ఉందన్నారు. ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులను పూర్తిస్థాయిలో నియమించుకోవడంపై దష్టి సారించాలన్నారు. ఆసుపత్రి అభివద్ధి కోసం నిధుల సమీకరణ విషయంలో తన స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఎంపీల్యాడ్స్ నిధులు, సీఎస్సార్ నిధుల కేటాయింపులు కోరుతూ ప్రతిపాదనలు పంపుతానన్నారు. ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సర్వజన ఆసుపత్రులకు వేర్వేరుగా బడ్జెట్ కేటాయించేందుకు అడ్డుగా ఉన్న సాంకేతిక సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. వైద్యసేవలను మరింత విస్తృతం చేసి పేద ప్రజలకు వైద్యసేవలను అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జెనరిక్ మందుల షాపు ఏర్పాటు, క్యాజువాలిటీ విస్తరణ, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు 2 ఫ్రీజర్ల మంజూరు, కోవిడ్ ఓపీకి ఆక్సిజన్ పైప్‌లైను, మెకానికల్ లాండ్రీ షాపు ఏర్పాటు చేసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ రఘునందన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇన్‌ఛార్జి సుబ్రమణ్యం, డిఎంహెచ్‌ఒ వీరబ్బాయి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ మునిచంద్రారెడ్డి, డీసీహెచ్‌ఎస్ కృష్ణవేణి, ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, నార్పల సత్యనారాయణ రెడ్డి, రచయిత తరిమెల అమర్నాథ్ రెడ్డితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










