Feb 19,2022 22:27

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి చెరుకువాడ

నిర్ణీత గడువులోగా జగనన్న కాలనీలు పూర్తి
గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి, శ్రీకాళహస్తి రూరల్‌

ప్రతి నిరుపేద సొంతింటి కలను నెరవేర్చేడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు చెచెరుకువాడ శ్రీరంగనాధరాజు అన్నారు. నిర్ణీత గడువులోగా జగనన్న కాలనీలన్నీ పూర్తయిపోవాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. మంత్రి చెరుకువాడ శనివారం పట్టణ సమీపంలోని ఊరందూరు, రాజీవ్‌నగర్‌ కాలనీల్లో నిర్మతమవుతున్న జగనన్న కాలనీలను స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఇప్పటికే గృహాలను ప్రారంభించిన లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడారు. బిల్లులు చెల్లిస్తున్నారా? లేదా? అంటూ ప్రశ్నించారు. ఇంటి నిర్మాణాలకోసం అవసరమైన అన్ని మౌలిక వసతులను ప్రభుత్వం మీ గడప ముందుకే తెస్తుందంటూ స్పష్టం చేశారు. అనంతరం రాజీవ్‌ నగర్‌లోని జగనన్న నవరత్నాల నిలయం వద్ద పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నిర్ణీత గడువులోగా జగనన్న కాలనీలు పూర్తయితే రాష్ట్రంలోని 33 లక్షల మంది పేదల సొంతింటి కల నెరువేరుతుందన్నారు. వీరికంటే ముందు టీడీపీ హయాంలో దరఖాస్తులు చేసుకున్న 3 లక్షల మంది టిడ్కో లబ్ధిదారులకూ గృహ ప్రాప్తి జరుగుతుందన్నారు. అయితే జగన్‌ ఘనతను ఓర్వలేక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అవాకులు, చవాకులు పేలుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. గతంలో స్థలం చూపించిన ఐదేళ్లకు గానీ ఇంటి నిర్మాణాలు జరిగేవి కావన్నారు. అయితే జగన్‌ ప్రభుత్వం ఇంటి స్థలం, ఇంటి పట్టాతో పాటు ఇంటి నిర్మాణాన్ని కూడా అప్పటికప్పుడే చేపడుతోందంటూ గుర్తు చేశారు. ఇప్పటికైనా అచ్చెన్నాయుడు అవాకులు, చెవాకులు మానుకోవాలంటూ హితవు పలికారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ప్రతిపక్షాలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నాయనీ, కానీ ఓటీఎస్‌ వల్ల కలిగే ప్రయోజనాలు మెండు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటీఎస్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకుని శాస్వత గృహ హక్కు అవకాశాన్ని పొందాలని సూచించారు. వైసీపీ నాయకులు లోకేష్‌ యాదవ్‌, సిరాజ్‌ బాషా, వయ్యాల కృష్ణారెడ్డి, గృహ నిర్మాణశాఖాధికారులు పాల్గొన్నారు.