Apr 09,2023 21:55

అనంతపురం కలెక్టరేట్‌ ఎదురుగా ఫాదర్‌ఫెర్రర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, తదితరులు

     అనంతపురం కలెక్టరేట్‌ : ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజల జీవితాల్లో వెలుగు నింపి పేదల పెన్నిధిగా నిలిచిన మహోన్నత వ్యకి విన్సెంట్‌ ఫాదర్‌ఫెర్రర్‌ అని పలువురు కొనియాడారు. ఫాదర్‌ఫెర్రర్‌ 103వ జయంతి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అనంతపురం ఆర్డీటీ కార్యాలయంతో పాటు, బత్తలపల్లి ఫెర్రర్‌ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల అభివృద్ధి, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన నిమిత్తం 1969లో ఫాదర్‌ ఫెర్రర్‌ అనంతపురం జిల్లాలో రూరల్‌ డెవలెప్‌మెంట్‌ ట్రస్టును స్థాపించారని చెప్పారు. ఆయన జీవితాంతం పేదల అభ్యున్నతి కోసం శ్రమించారని చెప్పారు. 103వ జయంతి కార్యక్రమాల్లో స్పెయిన్‌ కాన్సుల్‌ జనరల్‌ ఫెర్నాండో హెరాడియా నోగుర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుందుర్పిలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛూ ఫెర్రర్‌, బత్తలపల్లి మండలం ముష్టూరు గ్రామంలో ఆర్డీటీ ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ డైరెక్టర్‌ విశాల్‌ ఫెర్రర్‌ పాల్గొన్నారు.