
* అసైన్డ్ ల్యాండ్‌కు హక్కులు కల్పించేందుకు సాగుతున్న సర్వే
* పెద్దల అధీనంలో అనధికారికంగా అసైన్డ్ భూములు
* జిల్లాలో 2003కు ముందు 38,868.72 ఎకరాల పంపిణీ
* తాజా సర్వేలో పేదల సాగులో 14,852.61 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తింపు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న సర్వేలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. పేదలకు ఇచ్చిన భూములు పెద్దలపరమైనట్లు తెలుస్తోంది. గతంలో పేదలకు ఇచ్చిన చెరువులు, వాగులు, కాలువ భూములకు హక్కులు ఇవ్వబోమని అధికారులు చెప్తుండడంతో, ఇప్పటికే అనుభవంలో ఉన్న పేదలు తీవ్ర ఆందోళన చెందున్నారు. ఇప్పటివరకు చేపట్టిన సర్వేలో మూడోవంతు మందికీ హక్కులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు జిల్లాలో పేదలకు పంపిణీ చేసిన భూమిలో మూడింట రెండు వంతుల భూమి భూస్వాములు, పెద్దల అధీనంలోకి వెళ్లిపోయినట్లు సర్వే ద్వారా స్పష్టమవుతోంది.
అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఎపి అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్స్) సవరణ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం ఈ ఏడాది జూలై 27వ తేదీన తీసుకొచ్చింది. దీని ప్రకారం 2003, జూలై 31వ తేదీకి ముందు కేటాయించిన భూములపై ఆంక్షలు తొలగించి, అసైన్డ్ భూములకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించేందుకు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టింది. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సాగు అవసరాల కోసం జిల్లాలోని పేదలకు పలు సందర్భాల్లో వేలాది ఎకరాలను పంపిణీ చేశారు. భూమి లభ్యత ఆధారంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా 20 సెంట్ల నుంచి 2.5 ఎకరాల వరకు లబ్ధిదారులకు అందించారు. ఈ భూములు పొందిన లబ్ధిదారు కుటుంబాలు సాగు చేసి జీవన ప్రమాణాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ భూముల క్రయ విక్రయాలను నిషేధించింది. చట్టం అమల్లో అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడంతో, అనధికారికంగా పెద్దల చేతుల్లోకి భూమి వెళ్లిపోయింది. జిల్లాలో మూడు వంతుల భూమి మాత్రమే అసైనీలు, వారి వారసుల సాగులో ఉన్నట్లు ఇప్పటివరకు చేపట్టిన సర్వే ద్వారా స్పష్టమవుతోంది. పేదలకు పంపిణీ అయిన భూమిలో 66 శాతం విస్తీర్ణంలోని భూములు నిబంధనలకు విరుద్ధంగా భూస్వాములు, పెద్దల అధీనంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ భూముల్లో ఆక్వా చెరువులు తవ్వి రొయ్యలు, చేపలు పెంపకం సాగిస్తున్నట్లు గుర్తించారు.
పేదల సాగులో 14 వేల ఎకరాలే
జిల్లాలో జూలై 31, 2003కు ముందు 38,868.72 ఎకరాలు పంపిణీ అయినట్లు అధికారులు గుర్తించారు. వీటిలో ఇప్పటివరకు 14,852.61 ఎకరాలకు మాత్రమే హక్కులు కల్పించేందుకు అర్హమైనవిగా తేల్చారు. జిల్లాలో మొత్తం 621 గ్రామాలను సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 615 గ్రామాలను సర్వే చేశారు. సర్వే పూర్తి చేసిన తర్వాత నిషిద్ధ జాబితా నుంచి అసైన్డ్ భూములను తప్పించాలని సూచిస్తూ జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాయనున్నారు. దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ల శాఖ వాటిని డి-నోటిఫై చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ భూములకు క్రయ విక్రయాలు చేసుకునేందుకు వీలు పడుతుందని అధికారులు చెప్తున్నారు.
పెద్దల అధీనంలో 24 వేల ఎకరాలు!
అసైన్డ్ భూములకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన సర్వేలో 24,016 ఎకరాలు పెద్దల అధీనంలో ఉన్నట్లు తేలింది. పేదల అవసరమే ఆసరాగా చేసుకుని గ్రామంలోని భూస్వాములు, నాయకులు పేదల నుంచి తక్కువ ధరకు అనధికారికంగా కొనుగోలు చేసి తమ పరం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్లు, రొయ్యలు, చేపల చెరువులు, పలురూపాల్లో వాటిని వినియోగించుకున్నట్లు క్షేత్రస్థాయి సర్వేలో వెలుగుచూస్తున్నాయి. భూములపై నిషేధం ఉన్నప్పుడే వేలాది ఎకరాలు ఇతరుల పరాధీనమైన సందర్భంలో ఇప్పుడు నిషేధం ఎత్తివేయడంతో, ప్రస్తుతం పేదల సాగులో ఉన్న ఆ కాస్త భూమి పెద్దల పరం కానుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.