Apr 21,2023 22:02

ప్రజాశక్తి - యలమంచిలి
మండలంలోని చించినాడ గ్రామంలో 30 ఏళ్లుగా పేదల ఆధీనంలో ఉన్న లంక భూముల్లో ఇసుకను ఇతర ప్రాంతాల్లో ఉన్న జగనన్న లే అవుట్లకు తరలించడం అన్యాయమని కెవిపిఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తెలిపారు. లంకభూముల్లో ఇసుక తీయకూడదని ఆయా లంక భూముల లబ్ధిదారులు శుక్రవారం లంకలో చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి మాల్యాద్రి సంఘీభావం తెలిపి మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు పేదల నోట్లో మట్టి కొట్టి మట్టి వ్యాపారం చేశారని, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా పేదల నోట్లో మట్టి కొట్టి పేదల భూములను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్మోహన్‌ రెడ్డి కూడా పడుతుందన్నారు. లంక భూముల్లో ఇసుకను తవ్వడానికి ప్రయత్నించి ప్రభుత్వ అధికారులు దళితుల పట్ల తీరని వివక్షత చూపిస్తున్నారన్నారు. ఇప్పటికైనా దళిత భూములను వదిలి పెద్దల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆయన వెంట కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కె.క్రాంతిబాబు, సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జి, నాయకులు కానేటి బాలరాజు, గొల్ల ఏడుకొండల శ్రీనివాస్‌, చెల్లిబోయిన వడ్డీకాసులు పాల్గొన్నారు.
ంక భూముల జోలికొస్తే ఊరుకోబోం
కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘాల హెచ్చరిక
మండలంలోని ఏనుగువానిలంక గ్రామ పరిధిలోని చించినాడ పేదలకు చెందిన లంక భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోబోమని కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం చించినాడ లంక భూముల్లో ఇసుక తవ్వకాలు చేయకూడదని గ్రామంలోని పేదలంతా కలిసి స్థానిక లంకలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమాలకు సంఘీభావంగా హాజరైన క్రాంతి బాబు, జార్జి మాట్లాడుతూ పేదల భూముల్లో ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయాలని హైకోర్టు స్వయంగా స్టేఆర్డర్‌ ఇచ్చినప్పటికీ స్థానిక వైసిపి నాయకులు పేదలకు లంక భూములు లేకుండా చేయాలనే కక్షతో ఇక్కడి ఇసుకను ఇతర మండలాల్లోని జగనన్న లేఅవుట్ల పేరుజెప్పి పక్కదారి పట్టించి సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గపు చర్య తెలిపారు. 30 సంవత్సరాలుగా లంకభూముల్లో వివిధ రకాల పంటలు పండిస్తూ జీవనాధారం పొందుతున్న పేదలంతా కలిసి ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా, ఎన్నిసార్లు ఇసుక తవ్వకాలను అడ్డగించినా, ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో పోలీస్‌ బలగాలను ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఇక్కడి ఇసుకను తరలించడానికి ప్రయత్నించడం చేస్తున్నారని తెలిపారు. దీనిపై ఇప్పటికే వివిధ దళిత, బిసి సంఘాలు, ఇతర రాజకీయ పక్షాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి కార్యాచరణను రూపొందించడం జరిగిందన్నారు. ఈ భూముల జోలికొస్తే జిల్లా వ్యాప్తంగా అన్ని సంఘాల వారితో కలిసి పేదలకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు కానేటి బాలరాజు, గొల్ల ఏడుకొండల శ్రీనివాస్‌, చెల్లుబోయిన వడ్డీకాసులు, మల్లుల పుల్లారావు, ఎస్‌.భాస్కరరావు, ఎం.ఆంజనేయులు, టి.స్టాలిన్‌, బుంగ శంకరుడు, మురాల రత్నప్రసాద్‌, బూసి రాజశేఖర్‌ పాల్గొన్నారు.