33,527 మంది విద్యార్థులకు రూ.25.24 కోట్లు జమ
ప్రజాశక్తి - భీమవరం
జగనన్న విద్యాదీవెన పేద విద్యార్థులకు గొప్పవరమని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో జగనన్న విద్యా దీవెన మాన్యువల్ చెక్కును విద్యార్థుల తల్లిదండ్రులకు కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రియంబర్స్ మెంటు కింద అక్టోబరు, డిసెంబరు 2022 త్రైమాసికానికి 35,527 మంది విద్యార్థులకు రూ.25.44 కోట్లు 29,891 మంది తల్లుల ఖాతాలకు జమచేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎస్‌సి వెల్ఫేర్‌కు సంబంధించి 5,507 మంది విద్యార్థులకు రూ.5.53 కోట్లు, బిసి వెల్ఫేర్‌కు సంబంధించి 15,542 మంది విద్యార్థులకు రూ.10.29 కోట్లు, ఇబిసి వెల్ఫేర్‌కు సంబంధించి 3,240 విద్యార్థులకు రూ.2.70 కోట్లు, కాపు వెల్ఫేర్‌కు సంబంధించి 8,069 మంది విద్యార్థులకు రూ.5.90 కోట్లు, ట్రైబల్ వెల్ఫేర్‌కు సంబంధించి 67 మంది విద్యార్థులకు రూ.83 లక్షలు, ముస్లిం మైనార్టీ వెల్ఫేర్‌కు సంబంధించి 352 మంది విద్యార్థులకు రూ.31 లక్షలు, క్రిష్టియన్ వెల్ఫేర్‌కు సంబంధించి 659 మంది విద్యార్ధుల రూ. 41 లక్షలు కలిపి మొత్తం 33,527 మంది విద్యార్థులకు గాను 29,891 మంది తల్లుల ఖాతాలకు రూ.25.24 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ దాసి రాజు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జివిఆర్‌కెఎస్‌ఎస్.గణపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.శోభారాణి, జిల్లా ఎస్‌టి సంక్షేమ అధికారి డి.పుష్పరాణి పాల్గొన్నారు.










