Oct 28,2023 23:20

కొలతలను సేకరిస్తున్నఅటవీశాఖ అధికారులు

ప్రజాశక్తి- కంచిలి: మండలంలోని మండపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న బంజరి నారాయణపురం, అమ్మవారి పుట్టుగ, మండపల్లి పరిసర గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవు తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులు బంజరి నారాయణపురం, అమ్మవారి పుట్టుగా, మండపల్లి పరిసర ప్రాంత పొలాల్లో పరిశీలించారు. జిల్లా అటవీశాఖ అధికారిని నిషా కుమారి, కాశీబుగ్గ రేంజ్‌ ఆఫీసర్‌ మురళీకృష్ణ నాయుడు, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ ఐ.రాము, సిబ్బందితో కలసి పొలాల్లో స్థానికులు తెలిపిన పులి అడుగు జాడలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొలాల గట్లపై పరిశీలించిన అడుగు జాడలను బట్టి అది పెద్దపులి అయ్యుంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. పెద్దపులి పాదముద్రల కొలతలతో, పొలాల్లో దొరికిన పాదముద్రల కొలతలకు పోలి ఉండడం ఈ అంచనాలకు వస్తున్నట్లు చెప్పారు. ఇటీవల ఒడిశా సరిహద్దు ప్రాంతంలోనూ, అలాగే పలాస పరిసర ప్రాంతాల్లో పులి సంచరించినట్లు పలువురు తెలిపిన నేపథ్యంలో ప్రజల సైతం అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. శుక్రవారం అర్ధరాత్రి పులి పరిసర గ్రామాల్లో సంచరించినట్లు చెబుతున్నా... గ్రామస్తులెవరూ పులిని చూడలేదని తెలిపారు. అయినప్పటికీ ప్రజలు ఎవరు సాయంత్రం తర్వాత ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, పొలాలకు వెళ్లే సమయంలో సైతం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పులి సంచారానికి సంబంధించి ఏదైనా ఆచూకీ తెలిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. వన్యప్రాణిపై ఎటువంటి చర్యలకు దిగరాదని, అలా దిగితే శిక్ష అర్హులు అవుతారని హెచ్చరించారు. పరిసర గ్రామాల్లో పులి సంచారం గురించి తెలియడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అయ్యాయి. కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని జీవి దాడిలో లేగ దూడలు చనిపోయాయని చెబుతున్నారు. అధికారులు తక్షణమే తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ పరిశీలనలో బారువ ఫారెస్టు సెక్షన్‌ అధికారి రాజేంద్ర, బీట్‌ అధికారులు వెంకటేష్‌, దుర్గ దేవి, భానుమూర్తి, పోలయ్య, సురేష్‌ కుమార్‌, జోగారావు, బాబూరావు పాల్గొన్నారు.