Nov 02,2023 22:45

సమావేశంలో మాట్లాడుతున్న మురళీకృష్ణ

* అటవీశాఖ రేంజర్‌ మురళీకృష్ణ
ప్రజాశక్తి - పలాస, సోంపేట: 
ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోకి పెద్దపులి వచ్చినట్లు గుర్తించామని అటవీశాఖ కాశీబుగ్గ రేంజర్‌ మురళీకృష్ణ తెలిపారు. పెద్దపులి జాడ మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాశీబుగ్గలోని అటవీశాఖ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్ద పులి ప్రస్తుతం ఉద్దాన ప్రాంతంలో సంచరిస్తోందన్నారు. ఉద్దాన ప్రాంతంలో జీడి, కొబ్బరి తోటల్లో ఆవులను కట్టి ఉంచడం ద్వారా పెద్ద పులి వాటిని చంపేస్తోందన్నారు. సకాలంలో ఆహారం దొరకడం ద్వారా బయటకు వెళ్లకుండా ఉద్దాన ప్రాంత తోటల్లోనే సంచరిస్తోందని తెలిపారు. దాని జాడ మళ్లించేందుకు ఆవులు, ఇతర పశువులను గ్రామానికి సమీపంలోని శాలల్లో కట్టి ఉంచాలన్నారు. సాయంత్రం 5.30 తర్వాత, ఉదయం ఆరు గంటల ముందు ఆరు బయట విచ్చలవిడిగా తిరగరాదని సూచించారు. పులి అడుగుజాడలను అనుసరించి ఆయా గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. ఇటీవల ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస మండలాల్లో పెద్దపులి సంచరించిందని, పలాస మండలం లొత్తూరులోకి ప్రవేశించినట్లు తొలిసారి గుర్తించామన్నారు. పెద్దపులికి సకాలంలో ఆహారం అందుకుండా చూడగలిగితే బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందుకనుగుణంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
పెద్దపులి దాడిలో ఆవు మృతి
సోంపేట మండలం కర్తలిపాలెంలోని బత్తిన రామస్వామికి చెందిన పాడి ఆవును బుధవారం అర్ధరాత్రి పెద్ద పులి దాడి చేసి చంపేసింది. బాధిత రైతు, అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామస్వామి ఎప్పట్లాగే తన ఆవులను ఇంటి సమీపంలో కట్టి ఉంచాడు. బుధవారం అర్ధరాత్రి పెద్దపులి అందులో ఒక ఆవుపై దాడి చేసి, ఈడ్చుకుంటూ సమీపంలోని తోటల్లోకి తీసుకెళ్లి చంపేసింది. గురువారం ఉదయం రామస్వామి చూసేసరికి ఆవులు కట్టిన ప్రాంతమంతా చెల్లాచెదురుగా ఉండడం, ఒక ఆవు లేకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. సమీప తోటలో ఆవు కళేబరంతో పాటు చుట్టుపక్కల పులి పాదముద్రలు కనిపించడంతో వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు, పశువైద్యాధికారి చైతన్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆవుపై పులి దాడి చేసినట్లు నిర్ధారించి, పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు. పరిశీలనలో అటవీ శాఖ అధికారులు కృష్ణంనాయుడు, రాజేంద్ర, రాము, సిబ్బంది పాల్గొన్నారు.