May 30,2023 09:20

బహిరంగ సభ వేదిక నుంచి ప్రసంగిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

           తాడిపత్రి: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కషి చేయడంతో పాటు ఫ్యాక్షన్‌ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలను చైతన్యపరచిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరు అభినందనీయమని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీచరణ్‌ పేర్కొన్నారు. తాడిపత్రి నియోజకవర్గాన్ని సంక్షేమం, అభివద్ధి పథం వైపు నడిపించేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపట్టిన 3వ విడత ప్రజా సంక్షేమ పాదయాత్ర సోమవారం ముగిసింది. ఇందులో భాగంగా తొలుత వైసిపి ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కెట్‌ యార్డ్‌ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభించి బస్టాండ్‌ సర్కిల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషశ్రీచరణ్‌, గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, వైసిపి జిల్లా నాయకులు విశ్వేశ్వరరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, హిందూపురం వేణుగోపాల్‌రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాలతో ఏపీ శ్రీలంకలా మారబోతోందని విమర్శించిన చంద్రబాబు నేడు ఆయన విడుదల చేసిన టిడిపి మేనిఫెస్టోపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పెద్దారెడ్డి అంటే రౌడీ, ఫ్యాక్షనిస్టు అని పేర్కొన్న వారి గుండెల్లో దడ పుట్టిస్తూ, నియోజకవర్గంలో ప్రశాంత రాజకీయ పరిస్థితులు నెలకొల్పి, ప్రజల గుండెల్లో స్థానం మరింత పదిలం చేసుకున్నాన్నారు. తాడిపత్రిలో ఒక నాయకుడు దొంగబాబా వేషంలో తిరుగుతాడని వారిని నమ్మొద్దని కోరారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ పెద్దారెడ్డి గెలిస్తే ప్రతి పల్లెలో, వార్డులో రౌడీయిజం చేస్తారని జెసి కుటుంబం కోడై కూసిందని, అయితే నాలుగేళ్లలో నియోజకవర్గంలో ఎక్కడా చిన్న ఘర్షణ కూడా చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. ప్రతీకార చర్యలకు పాల్పడకుండా కార్యకర్తలను క్రమశిక్షణతో నడిపిస్తూ బాధితుల పక్షాన నిలబడ్డామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో రూ. 200కు కొళాయి కనెక్షన్‌, 20 ఎకరాల్లో పార్కు, వంద పడకల ఆసుపత్రి, మార్కెట్‌ ఆవరణలో ఆరోగ్య కేంద్రం నిర్మించామని గుర్తుచేశారు. చెరువులు, ప్రాజెక్టులను నీటితో నింపి రెండు పంటలకు సాగునీరు అందించామన్నారు. తనపై ఆరోపణలు చేస్తూ పంచిన కరపత్రాలపై చర్చకు సిద్ధమన్నారు. ప్రజాస్వామ్యానికి విలువ తెలియని నాయకులు, అసాఘింక కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌ జెసి కుటుంబం అని ఆరోపించారు. అవినీతికి పాల్పడి వాహనాలు నడిపి అనేక ప్రాణాలు బలిగొన్న వ్యక్తి జేసీ ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. కాగా ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ కేతిరెడ్డి అభిమానులు, వైసిపి కార్యకర్తలు అడుగడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పాదయాత్ర ముగిసే వరకు అడుగడుగునా టపాసులు పేలుస్తూ సాదర స్వాగతం పలికారు.