అనంతపురం సిటీ : త్వరలో జరగబోయే పది సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టాలని డిఇఒ ఎం.సాయిరామ్ తెలియజేశారు. సోమవారం ఉదయం నగరంలోని కెఎస్‌ఆర్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఒ మాట్లాడుతూ జూన్ రెండో తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 49 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. 14,465 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. ప్రశ్నాపత్రాలు మంగళవారం జిల్లాకు వస్తాయని, వాటిని బుధవారం ఆయా పోలీస్ స్టేషన్లకు తరలిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, బెంచీలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు జరిగే సమయంలో బయట వ్యక్తులను ఎవర్నీ కేంద్రంలోకి అనుమతించకూడదన్నారు. మాస్‌కాపీయింగ్ లేకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ గోవింద నాయక్, డివైఈవోలు పద్మప్రియ, శంకర ప్రసాద్, పర్యవేక్షకులు సరళ, పాల్గొన్నారు.










