ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: పదితరాలు చెప్పుకునేలా ఈ సారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించునున్నామని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. అందుకు అన్ని శాఖల సహకారమవసరమని కోరారు. స్థానిక ఆలయ పరిపాలనా భవనంలో శుక్రవారం అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఆర్డీవో కనకనర్సారెడ్డి, ఏఎస్పీ సుప్రజ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, లోపాలు సరిదిద్దుకుని ఉత్సవాలను నిర్వహించాలని అన్నారు. ప్రధానంగా పట్టణంలో విద్యుత్‌కాంతులు మిరు మిట్టుగొలిపేలా ఏర్పాట్లుండాలనీ, ఓం నమశివాయ నినాదాలు మారు మ్రోగేలా సౌండ్ సిస్టం వుండాలని సూచించారు. ఆలయంలో 14 రోజుల పాటు పూల అలంకరణను కర్ణాటక, తమిళనాడు వారి సహకారంతో చేపట్టనున్నట్లు తెలిపారు. గతేడాది కన్నా ఈ సారి బస్సు సౌకర్యం మెరుగుపర్చాలనీ, మెడికల్ క్యాంపులను బస్టాండ్‌లో కుడా ఏర్పాటు చేయాలన్నారు. అంబులెన్సులు గతంలో రెండు మాత్రమే అందుబాటులో ఉంచారనీ, ఈ సారి నాలుగు అందుబాటులో ఉంచాలని సూచించారు. సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించి పది కాలాల పాటు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా వున్నాయని చెప్పుకునే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. లింగోద్భవ దర్శనంలో తోపులాట జరగకుండా చూడాలని, గుడిలో నుండి బయటకు వచ్చే భక్తులకు ప్రత్యెక ద్వారంపై దష్టి త్వరగా బయటకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు వుండాలని సూచించారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఏఎస్పీ సుప్రజ
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజ అన్నారు. నాలుగు మాడ వీధులతో పాటు గుడిలో వున్న 260 సీసీ కెమెరాలకు అదనంగా60 ఏర్పాటు చేసి మెగా కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. కాల్ సెంటర్ ఏర్పాటు చేసి భక్తులకు సంపూర్ణ సహాయ సహకారాలందిస్తామన్నారు. శాంతి భద్రతల విషయం లో సిబ్బంది, అధికారులు సమన్వయతో పని చేస్తారని తెలిపారు. తిరువీధుల్లో ఉత్సవాల ఊరేగింపు సమయంలో హారతి ఇవ్వడానికి ప్రత్యేక స్థలాల గుర్తింపు చేయ గలిగితే ట్రాఫిక్ తగ్గుతుందనిసూచించారు తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి మాట్లాడుతూ రవాణా సౌకర్యాలు, శాంతి భద్రతలు ప్రధానమని అన్నారు. శానిటేషన్ విషయం లో మెరుగ్గా వుండాలనీ, అందుకవసరమైన అన్ని వసతులను సమకూరుస్తామని తెలిపారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ చొరవచూపాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ కి సంబంధించి అగ్ని మాపక అధికారులు అప్రమత్తంగా వుండాలని కోరారు. బాల్య వివాహాలు జరగకుండా ఐసీడీఎస్ అధికారులు అన్నిశాఖల అధికారులతో కలిసి పనిచేయాలన్నారు. ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఈ నెల 24నుండి మార్చి 9 వరకు జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై విధి విధానాలు వివరించారు. గతంలో లాగానే మహాలఘు దర్శనం ఏర్పాటు ఉంటుందనీ, ఉచిత దర్శనం రంగుల గోపురం నుండి, స్థానికులకు ఇచ్చే రూ.200, రూ. 50 టిక్కెట్టు దర్శనాలను శివయ్య గోపురం నుండి, రూ.500 టిక్కెట్టు దర్శనాలను సుపథం గుండా భక్తులను పంపుతామని తెలిపారు. మార్కెట్ యార్డ్, ఎపి సీడ్స్ , నారాయణ స్కూల్ , స్కిట్ కాలేజి, కష్ణ మందిరం వెనుక, ఎంజిఎం లాండ్స్‌లో పార్కింగ్‌కు కేటాయించామని చెప్పారు. బస్టాప్‌ల నుండి స్కూల్ బస్సుల ద్వారా భక్తులకు ఉచిత సేవలందిస్తామని చెప్పారు. ఉత్సవాల విజయవంతంలో అందరూ భాగస్వాములౌ జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఐసిడిఎస్ బాల్య వివాహాల నిషేధం, గుడిమల్లం మహాశివరాత్రి ఉత్సవాల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సమీక్షలో స్వామి గురుకుల్, మునిసిపల్ కమీషనర్ బాలాజీ నాయక్ , ఇరిగేషన్ అధికారి గోపాల్, ఆర్‌టిసి డిఎం సుబ్రహ్మణ్యం, ఐసిడిఎస్ పిడి నాగపద్మజ, సిడిపిఓ శాంతి దుర్గ, ఎలక్ట్రికల్ ఇఇ వాసు రెడ్డి, తహసిల్దార్ షేక్ జరీనా, డిప్యుటీ ఇఓ కృష్ణా రెడ్డి, ఇఇ వెంకట నారాయణ, పోలిస్ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.










