అనంతపురం ప్రతినిధి : అక్షర క్రమంలో ముందున్న అనంతపురం జిల్లాను పదవ తరగతి ఉత్తీర్ణతలోనూ అగ్రభాగాన నిలిపే లక్ష్యంతో విద్యా శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. 'అనంత సంకల్పం' పేరుతో ప్రత్యేక కార్యచరణను రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా వారి విద్యాభ్యాసం జరుగుతున్న తీరును కూడా ఇళ్ల వద్దకెళ్లి ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి మెరుగైన ఫలితాలు వచ్చేలా 'పది'ంతల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది 35,305 పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 30 వేల మంది రెగ్యులర్ పరీక్ష రాస్తుండగా తక్కిన వారు గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులున్నారు. జిల్లాలో 313 ప్రభుత్వ పాఠశాలల్లో 17,249 మంది విద్యార్థులు ఈ సారి 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో 'అనంత సంకల్పం'
గతేడాది పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో అనంతపురం జిల్లా ఆఖరు భాగాన నిలిచింది. 49.70 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఈ శాతాన్ని ఈ ఏడాది పెంపొందించేందుకు విద్యాశాఖ 'అనంత సంకల్పం' పేరుతో ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. దీన్ని వారం వారం జిల్లా కలెక్టర్ సమక్షంలో పర్యవేక్షించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఏడు రౌండ్లలో విద్యార్థులకు అదనపు క్లాసులు నిర్వహించారు. ఉదయం, సాయంత్రం అదనపు క్లాసులు తీసుకున్నారు. ప్రతి వారంవారం పరీక్షలు నిర్వహించారు. ఫ్రీ ఫైనల్ కూడా అయిపోయాయి. పూర్తి స్థాయి పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో ముఖ్యమైన సబ్జెక్టులపై మరోమారు విద్యార్థులకు బోధించడం జరుగుతోంది. విద్యార్థులు ఇళ్ల వద్ద చదువుతున్నారా.? లేదా.? అన్న పర్యవేక్షణ సైతం చేపడుతున్నారు.
పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం
పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు విద్యా శాఖ చేపడుతోంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి అనంతపురం జిల్లా పరిధిలో మొత్తం 139 కేంద్రాల్లో పరీక్షలు జరుగనున్నాయి. జిల్లా కేంద్రం అనంతపురం నగరంలోనే 30 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటు అధికారుల నియామకాలు చేశారు. విద్యార్థుల్లోనూ పరీక్షలపై అవగాహన కార్యక్రమాలను సైతం ఆ శాఖ చేపడుతోంది.
ఉత్తీర్ణత శాతం పెంచుతాం
సాయిరామ్, జిల్లా విద్యాశాఖ అధికారి, అనంతపురం.
గతేడాది పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చివరిగా అనంతపురం జిల్లా ఉంది. ఈసారి ఉత్తీర్ణత శాతం పెంచుకునే దిశగా ప్రణళికను రూపొందించాం. మంచి ఫలితాలు వచ్చేందుకు అవసరమైన కార్యచరణను చేపట్టాం. విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఇళ్ల వద్ద ఏ విధంగా చదువుతున్నారన్నది కూడా పర్యవేక్షిస్తున్నాం. విద్యార్థుల్లోనూ మానసిక స్థైర్యాన్ని నింపి మంచి మార్కులు సాధించే విధంగా కృషి చేస్తున్నాం.










