Apr 21,2023 08:25

మూల్యాంకనాన్ని పరిశీలిస్తున్న ఆర్‌జెడి ప్రతాప్‌రెడ్డి

        అనంతపురం సిటీ : ఈ సారి పదో తరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గతం కంటే మెరుగ్గా ఉంటుందని ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. అనంతపురం కెఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పది మూల్యాంకన కేంద్రాన్ని డిఇఒ ఎం.సాయిరామ్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ పది మూల్యాంకనం సజావుగా జరుగుతోందని చెప్పారు. ఉపాధ్యాయులకు కావాల్సిన వసతులు అన్నీ కల్పించామని చెప్పారు. మూల్యాంకనం విధులకు వచ్చన ఉపాధ్యాయులు అందరూ నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు. ఈసారి పదో తరగతి పరీక్షల ఫలితాలు గ్రేడ్‌ రూపంలో కాకుండా మార్కుల రూపంలో వస్తాయన్నారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మే నెలలో వచ్చే అవకాశం ఉందన్నారు. వేసవి సెలవుల్లో 98 డీఎస్సీ ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎసిలు ప్రసాద్‌, గోవిందనాయక్‌, డిప్యూటీ డీఈవోలు పద్మప్రియ, శంకర పాల్గొన్నారు.
మెడికల్‌ క్యాంపు ఏర్పాటు
ప్రస్తుతం ఎండలు ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.సాయిరామ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని మూల్యాంకనం కేంద్రంలో మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేయించారు. ఈ మెడికల్‌ క్యాంప్‌ను డీఈవో పరిశీలించారు. ఏఏ మందుకులు అందుబాటులో ఉంచారన్న విషయాన్ని వైద్య సిబ్బందితో అడిగి తెలుసుకున్నారు.