Mar 28,2023 21:55

ప్రజాశక్తి - పెనుమంట్ర
పౌష్టికాహారం అందించడమే జగనన్న గోరుముద్ద లక్ష్యమని ఎండిఎం జిల్లా సమన్వయకర్త కె.కృష్ణారావు అన్నారు. మంగళవారం పొలమూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఎంపియుపి స్కూల్‌లో మధ్యాహ్న భోజనం, రాగి జావ పంపిణీని, తాగునీరు, మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి అధిక ప్రాధాన్యతిస్తోందన్నారు. పోషక విలువలతో కూడిన మెనూ రూపొందించడమే కాకుండా, వారానికి ఐదు రోజులు కోడి గుడ్డు, 3 రోజులు చిక్కీ, మరో మూడు రోజులు రాగి జావ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తరువాత రికార్డులను పరిశీలించారు. నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. 90 శాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో భాగస్వాములయ్యేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బండి ఆంజనేయులు, సిఆర్‌పి కుక్కల మంగతాయారు, దొంగ సత్యనారాయణ, ఎస్‌ఎంసి ఛైర్మన్‌ దుర్గాప్రసాద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.