అనంతపురం సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాంటి లోపాలు కన్పించినా సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని ఆర్‌జెడి వెంకటకృష్ణారెడ్డి హెచ్చరించారు. అనంతపురం నగరంలోని సైన్స్ సెంటర్‌లో జిల్లాలోని ఎంఇఒ-1, ఎంఇఒ-2, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్‌తో బుధవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ ఉన్నతాధికారుల స్కూల్స్ విజిట్స్‌లో ఏలాంటి లోపాలు ఉండకూడదన్నారు. ఎంఇఒలు జాబ్‌ఛార్ట్ ప్రకారంగా పనిచేయాలన్నారు. స్కూల్స్ తనిఖీలకు వెళ్లినప్పుడు టీచర్లతో పాటు విద్యార్థుల హాజరును పరిశీలించాలన్నారు. విద్యార్థులు హాజరుకాకపోతే ఎందుకు రాలేదన్న విషయాలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. బడిఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలన్నారు. వంద శాతం అడ్మిషన్లు నిర్వహించాలన్నారు. ఈనెల 22వ తేదీ లోపు సెమిస్టర్- 2 పుస్తకాలు విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు ఒకటి నుంచి ఎఫ్ ఏ-వన్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఈ పరీక్షలను 3 నుంచి 9వ తరగతి విద్యార్థులంతా ఇంగ్లీషులోనే రాయాలన్నారు. తెలుగులో రాస్తే అందుకు టీచర్లే బాధ్యత అన్నారు. ఎంఈఓలు, హెచ్‌ఎంలు వారి పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాలను తెలుసుకుని, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు వివరాలు కూడా తెలుసుకోవాలన్నారు. మూడు నుంచి 10వ తరగతి, 6 నుంచి పదవ తరగతి విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట యూపీ స్కూల్స్ నుంచి సర్దుబాటు చేసుకోవాలన్నారు. ఎంఈఓ-1, ఎంఈఓ-2 ఇద్దరూ ఒకటేనని, ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరితో సమన్వయం చేసుకుని విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఇఒ ఎం.సాయిరామ్, డివైఇఒలు పద్మప్రియ, శంకర్ ప్రసాద్, ఎడి కష్ణయ్య, డీఈఓ ఆఫీస్ ఏఎస్‌ఓ ఓబులరెడ్డి, ఏపీవోలు మారుతి, నాగరాజు, నారాయణస్వామి, ఎండిఎం కో-ఆర్డినేటర్ ముస్తాక్ పాల్గొన్నారు.










