Jul 30,2022 21:16

పాఠశాలల విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలి
ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డి డిమాండ్‌
ప్రజాశక్తి- నగరి:
3,4,5 తరగతులను హైస్కూల్లో విలీనం చేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని కోరుతూ బడి కోసం బడి యాత్ర అనే పేరుతో యుటిఎఫ్‌ ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస నుండి బస్సు యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం బస్సు జాత నగరి మండలం, వినాయకపురం ప్రాథమిక పాఠశాలకు చేరుకుంది. అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్సీలతో ముఖాముఖి నిర్వహించి విలీన ప్రక్రియ వలన వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని లేకపోతే తాము తమపిల్లల్ని పాఠశాలకు పంపించమని లిఖితపూర్వకంగా ఎమ్మెల్సీలకు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రమణ్యం, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, ఐ.వేంకటేశ్వరలు మీడియాతో మాట్లాడుతూ నూతన విద్యావిధానంలో భాగంగా 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించు కోవాలన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా అమలు కాని, బిజెపికి మద్దతు ఇస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా అమలుకాని నూతన విద్యావిధానాన్ని తీసుకువచ్చి రాష్ట్రప్రభుత్వంలో అమలుపరుస్తున్న తీరు చాలా బాధాకరమని అన్నారు. ఉపాధ్యాయుల, పట్టభద్రులు ఎమ్మెల్సీలుగా తాము ఈ ప్రక్రియను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నాడు- నేడు కింద పాఠశాలకు లక్షల కోట్లు ఖర్చుపెట్టి ఆ తరువాత విలీనప్రక్రియ పేరుతో ఆ పాఠశాలను ఉన్నట్లుగానే వదిలేసి వెళ్లిపోవడం వలన నాడు- నేడు కింద ఖర్చుపెట్టిన నిధులు వధా అవుతుందనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. ఇలా విలిన ప్రక్రియ వలన తల్లిదండ్రులలో ఎవరో ఒకరు ప్రతిరోజూ తమ పిల్లలను తీసుకుపోయి పాఠశాలలో వదిలిపెట్టడం, తిరిగి సాయంత్రానికి వెళ్లి తీసుకురావడం వలన వారు తమ జీవనోపాధిని కోల్పోతారని అన్నారు. దీనివలన వారి జీవితం మీద మరింత ఆర్థిక భాగం పెరిగిపోతుందని, కొన్నాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు వలన పిల్లలను అర్ధాంతరంగా విద్యకు దూరం చేసే ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అలాగే 3,4,5 తరగతులకు చెందినటువంటి చిన్నపిల్లలు ఎక్కడో దూరాన ఉన్నటువంటి హైస్కూల్‌కి ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో రోడ్డు ప్రమాదాలకు గురవయ్యే అవకాశం కూడా ఉన్నందువలన రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని వెంటనే విలీన ప్రక్రియను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పిస్తారని హితువు పలికారు. స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నగరి నియోజకవర్గంలో ప్రత్యేకంగా నగరి మండలంలోని దాదాపు 18 పాఠశాలలు విలీన పట్టికలో ఉందని, విలీన పాఠశాలల్లో చదువుతున్నవంటి పిల్లల తల్లిదండ్రులు దినకూలీల మీద ఆధారపడి జీవిస్తున్నారనే విషయం మంత్రి రోజాకి బాగానే తెలుసునని, కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా తల్లిదండ్రుల బాధలను, సమస్యలను అర్థం చేసుకొని విలీన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు చర్య తీసుకోవాలని తెలిపారు.