Jul 19,2023 20:43

ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ పద్మశ్రీ
ప్రజాశక్తి - కాళ్ల
నాడు - నేడులో భాగంగా పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ గంటా పద్మశ్రీ అన్నారు. కోపల్లెలో మంతెన దుర్గరాజు, రాజయ్యమ్మ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ను జెడ్‌పి ఛైర్మన్‌ పద్మశ్రీ డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్‌పి ఛైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో మన బడి, నాడు-నేడు రెండో విడత పనులు వేగంగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచిస్తున్నామన్నారు. అదనపు తరగతి గదులు, కిచెన్‌ షెడ్లు, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణ పనులు పాఠశాలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పనుల పరిశీలనలో పేరెంట్స్‌ కమిటీలను, దాతలను, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలన్నారు. కోపల్లె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు నాడు-నేడు రెండో విడతలో రూ.36 లక్షల నిధులు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం జగనన్న గోరుముద్ద పథకాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి పెనుమత్స శిరీష విశ్వనాథరాజు, జెడ్‌పిటిసిలు పచ్చిగోళ్ల సోమేశ్వరరావు, యండగండి శ్రీను, రణస్థల కనకదుర్గ మహంకాళి పాల్గొన్నారు.
ఉండి : వందేళ్ల చరిత్ర కలిగి ఉన్న ఉండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేస్తానని ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్‌ గంటా పద్మశ్రీ అన్నారు. బుధవారం ఉండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పద్మశ్రీ ఆకస్మిక తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో ఆక్రమణలను తొలగించి ప్రహరీ గోడను ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల క్రీడా మైదానం వర్షపు నీటితో నిండిపోవడం చూసి విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యమని అన్నారు. క్రీడామైదానం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలలో ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం జెడ్‌పి ఛైర్మన్‌ పద్మశ్రీ దంపతులను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు, ఉండి జెడ్‌పిటిసి రణస్థుల కనకదుర్గ మహంకాళి, ఆకివీడు జెడ్‌పిటిసి వేగేశ్న వెంకట్రాజు, ఉండి గ్రామ సర్పంచి కమతం సౌజన్య బెనర్జీ, నాయకులు పాల్గొన్నారు.