ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ నగరంలో పారిశుధ్య మెరుగుకు ప్రాధాన్యత ఇస్తున్నామని మేయర్ మహమ్మద్ వసీం తెలిపారు. సోమవారం నగరంలోని 43, 46, 48వ డివిజన్ల పరిధిలో చేపట్టిన ఇంటింటి చెత్త సేకరణ తీరును మేయర్ పరిశీలించారు. ఇందులో భాగంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలో పారిశుధ్యం మెరుగుపర్చడంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఇంటింటికీ చెత్త సేకరణకు వచ్చే కార్మికులకు అందించాలని సూచించారు. ఇకపోతే సచివాలయ సిబ్బంది స్థానికులకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించారు. అదేవిధంగా కాలువల్లో పూడికతీత పనులను పరిశీలించి, రానున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు పూడికతీత పనులను చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇషాక్, శ్రీనివాసులు, ఎంహెచ్‌ఒ గంగాధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చెత్త సేకరణ తీరును పరిశీలిస్తున్న మేయర్ వసీం










