Feb 27,2023 20:56

ప్రజాశక్తి - ఉండి
పారిశుధ్య సమస్యను పరిష్కరించండి మహాప్రభో అంటూ కోండ్రోతుపేటకు చెందిన మహిళలు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ వీధిలో డ్రెయినేజీల్లో మురుగునీరు పేరుకుపోయి రోడ్లపైకి వచ్చేస్తోందని, దీంతో దుర్వాసన వెదజల్లి రోడ్డుపైకి రావాలంటే ఇబ్బందిగా ఉందని తెలిపారు. మురుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమలు పెరిగిపోయి అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలంలోనే మురుగునీరు రోడ్లపైకి వచ్చేస్తుంటే వర్షాకాలంలో ఏ విధంగా ఉండాలని అధికారులను ప్రశ్నించారు. తక్షణం అధికారులు స్పందించి పారిశుధ్య సమస్యను పరిష్కరించాలని కోరారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ వర్మకు వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించే వరకూ దశల వారీగా పోరాటం చేస్తామని సిపిఎం నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోండ్రోతుపేటకు చెందిన మహిళలు బి.సాయికుమారి, కె.పరాళ్లు, జె.లక్ష్మీ, బి.శ్యామల, కె.గ్రేసి, జె.సూరమ్మ, కె.సింహాచలం, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్‌, మండల కార్యదర్శి ధనికొండ శ్రీనివాస్‌, చీర్ల శేషు, చీర్ల శ్రీనివాస్‌, ఎం.గోపి, చిప్పాడ బుచ్చేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.