అనంతపురం కార్పొరేషన్ : సమాజాన్ని పరిశుభ్రంగా, సుందరంగా ఉంచేందుకు పార్శిశుధ్య కార్మికులు వారి ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి విధులను నిర్వహిస్తుంటారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజల కోసం వారు పనిచేశారు. అనంతపురం ప్రాంతంలో గతేడాది నడిమివంకకు వరదలు రావడంతో అక్కడి పరివాహక ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ సమయంలోనూ మేమున్నామంటూ పారిశుధ్య ఇంజినీరింగ్ కార్మికులు రాత్రింబవళ్లు తేడా లేకుండా ప్రజలకు సేవలు అందించారు. ఇంతలా శ్రమిస్తున్న కార్మికులను గుర్తించడంలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కొనసాగుతోంది. ఇటీవల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ కార్మికులను అవార్డులకు ఎంపిక చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. అవార్డులకు ఎంపిక చేయకుండా ఏదో చేయాలంటే చేయాలన్నట్లు ఓ హాట్‌బాక్స్, శాలువ ఇచ్చి వారిని సంతృప్తి పరిచే ప్రయత్నాన్ని కార్పొరేషన్ అధికారులు చేశారు. దీనిపై కార్మికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులిచ్చిన వాటిని వారికే 'రిటర్న్‌గిఫ్ట్'గా వెనక్కు ఇచ్చేసి నిరసన తెలిపారు. ప్రజల బాగుకోసం ఇంతలా శ్రమిస్తున్న తమను అవార్డులకు ఎంపిక చేయకుండా అవామానించారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సేవలో నిమగమయ్యే కార్మికులు అధికారుల దష్టిలో ప్రయోజనకారులు కాదాని ప్రశ్నించారు. గతంలో స్వాతంత్య్ర దినోత్సవం నాడు కార్మికులను అవార్డులకు ఎంపిక చేసి కలెక్టర్, ఇతర అధికారుల చేతులమీదుగా సత్కరించే వారని, ఇప్పుడు అలా చేయకుండా హాట్‌బాక్సులు ఇచ్చి అవమానించడంపై కార్మికులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యకం చేస్తున్నారు.
కార్మికులను అవమానించారు..
ఏటీఎం నాగరాజు,
మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు
మున్సిపల్ పారిశుధ్య కార్మికులను అవార్డులకు ఎంపిక చేయకుండా కార్పొరేషన్ అధికారులు అవమానించారు. ఈ పనులు చేస్తున్నవారంతా దళితులనే కారణంతో వారి పట్ల నిర్లక్ష్యం వ్యవహరించారు. ఇది సరైన పద్ధతి కాదు. జిల్లా ఉన్నతాధికారి చేతులు మీదుగా కాకుండా మున్సిపల్ కార్యాలయంలో నాణ్యతలేని విలువ లేని వస్తువులను కార్మికులకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమే అధికారులే సమాధానం చెప్పాలి. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల పట్ల ఇంత చిన్నచూపు తగదు.
కార్మికులను విస్మరించడం తగదు
నాగభూషణం,
మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
ప్రజల ఆరోగ్యం, నగర పరిశుభ్రత కోసం మున్సిపల్ కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. వారి ఆరోగ్యాలను ఫణంగా పెట్టి గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఇలాంటి వారిని అధికారులు గుర్తించకుండా అవమానించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అధికారులను సత్కరించి, కార్మికులను విస్మరించడం సరికాదు. గతంలో ఇలాంటి సంస్కృతి లేదు. కరోనా వారియర్స్‌గా విధులు నిర్వహించిన వారే ఇలా నిర్లక్ష్యం చేయడం తగదు. గతేడాది కాలంలో కార్మికులు వివిధ రూపాల్లో ప్రజలకు సేవలు అందించారు. అలాంటి వారిని స్వాతంత్య్ర దినోత్సవం నాడు అవార్డు ఇచ్చి సత్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.










