May 22,2023 21:57

కమిషనర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు

         ప్రజాశక్తి-గుత్తి    మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు అన్ని సెలవులనూ వర్తింపజేయాలని సిఐటియు అనుబంధ సంస్థ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు బి.నాగభూషణం డిమాండ్‌ చేశారు. ఈమేరకు సోమవారం పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ జి.శ్రీనివాసులుకు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు పండుగ, జాతీయ రెండవ శనివారం సాధారణ సెలవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బదిలీ కార్మికులను నియమించుకునేందుకు అనుమతి ఉన్నా గుత్తిలో మాత్రం బదిలీ కార్మికులను నియమించుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. గత నాలుగు రోజులుగా ఆరుగురు కార్మికులకు మస్టరు వేయడం లేదన్నారు. పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులకు జిపిఎఫ్‌, ఇఎస్‌ఐ వంటి సౌకర్యాలు గుత్తేదారుల నుంచి ఎపిసి ఓఎస్‌ కు అనుసంధానం కావడంలేదన్నారు. అలాగే గుత్తి మున్సిపాలిటీ విస్తీర్ణం, జనాభాకు సరిపడ కార్మికులను నియమించి పనిభారం తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎటిఎం నాగరాజు, గుత్తి మున్సిపల్‌ యూనియన్‌ అధ్యక్షుడు కె.సూర్యనారాయణ, ఉపాధ్యక్షుడు కె.మహేష్‌, కార్యదర్శి ఎన్‌. రామాంజనేయులు, సహాయ కార్యదర్శి టి.సుంకన్న, కోశాధికారి కె.బాల రంగన్న తదితరులు పాల్గొన్నారు.