అనంతపురం కార్పొరేషన్ : ఎన్నికల హామీలు, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు ఆందోళనబాట పట్టారు. బుధవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఇంటి వద్ద ధర్నా చేపట్టారు. అంతకుముందు టవర్‌క్లాక్ ఫ్లైఓవర్ నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటి వద్ద బైటాయించి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేసే అవుట్‌సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, కార్మికులకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు, పట్టణ కమిటీ ఒకటి రెండు కమిటీల కార్యదర్శుల వెంకటనారాయణ, మూర్తిజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నారు. నాలుగున్నర సంవత్సరాలు కావస్తున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం కార్మికులను నిరాశ, నిస్పహలకు గురి చేస్తోందన్నారు. ఎన్నికల హామీ మేరకు కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. కార్మికులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే అనంతకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్మికులతో మాట్లాడుతూ ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారని, ఆ సమయంలో ఆయన దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో కార్మికులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం నగర అధ్యక్షులు బండారి స్వామి, కార్యదర్శి సాకే తిరుమలేష్, లక్ష్మీనరసమ్మ, శశింద్ర కుమార్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.










