ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
రెవెన్యూ భూముల స్వచ్చీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వే పనులను శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు, ''జగనన్న శాశ్విత భూహక్కు - భూ రక్ష పథకం'' రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ చైర్మన్ అజరు కలాం అధికారులను ఆదేశించారు. గురువారం కడప కలెక్టరేట్ స్పందన హాలులో.. ''జగనన్న శాశ్విత భూ హక్కు - భూ రక్ష'' పథకంలో భాగంగా చేపడుతున్న రీసర్వే అమలు తీరు, పురోగతిపై.. రాష్ట్ర సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డుల కమీషనర్ సిద్దార్థ్ జైన్ తో కలిసి.. వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, జేసిలు, ఆర్డీఓలు, సంబందిత అధికారులతో ప్రాంతీయ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ తోపాటు.. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పి.ఎస్. వైఎస్‌ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల జేసీలు సాయికాంత్ వర్మ, తమీమ్ అన్సారీయా, బాలాజీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ అజరు కలాం మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ల నుండి జేసిల, ఆర్డీఓలు, క్రింది స్థాయి అధికారుల వరకు సర్వే నియమాలు, టీమ్ వరకు స్పూర్తితో ముందుకెళ్లాలన్నారు. ''దున్నేవాడిదే భూమి'' అన్న సామెత ప్రకారం.. పొలాన్ని దున్నే వాడికే భూమిపై సర్వ హక్కులు కల్పించాలని ప్రభుత్వం యోచించి.. నిజమైన అనుభవ దారులకే పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆర్.ఓ.ఆర్., సర్వే బౌండరీ చట్టానికి లోబడి అనుభవ దారులకు భూ హక్కులు, వారి భూములకు కూడా పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు.










