ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్
రాష్ట్ర ప్రభుత్వం పేదరికమే ప్రామాణికంగా పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అటవీ, పర్యా వరణ, విద్యుత్, శాస్త్ర సాంకేతిక శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలులో భాగంగా ఆటో, టాక్సీ, క్యాబ్, మాక్సీ క్యాబ్ వాహన యజమానులకు 4వ విడతలో వై.ఎస్.ఆర్ వాహనమిత్ర కార్య క్రమం ద్వారా లబ్ది చేకూర్చే బహత్కర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం నుండి వర్చువల్ విధానంలో ప్రారంభించి వై.ఎస్.ఆర్ వాహన మిత్ర లబ్దిదారులకు బటన్ నొక్కి నగదు జమ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయిలో స్థానిక డా.బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యకమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో ఇచ్చిన ఎన్నికల హామీలను అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే 95 శాతం అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని తెలిపారు. నవరత్నాలలో భాగంగా వరుసగా నాలుగవ ఏడాది వై.ఎస్.ఆర్ వాహన మిత్ర పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 2,61,516 మంది లబ్దిదారులకు ఒక్కొకరికీ రూ. 10 వేలు చొప్పున రూ.261.51 కోట్లు నేడు విశాఖపట్నం లో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జమ చేస్తున్నారని, జిల్లాలో 6044 మంది అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సి, క్యాబ్ డ్రైవర్ లు లబ్ది పొందుతున్నట్లు తెలిపారు. చిత్తూరు ఎంపి ఎన్.రెడ్డెప్ప, జడ్‌పి ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్ ఎం.హరినారాయణన్, ఎపిఎస్‌ఆర్‌టిసి వైస్‌ఛైర్మన్ విజయానందరెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ ఛైర్మన్ బి.సురేస్, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ రామచంద్రారెడ్డి, జడ్‌పి వైస్‌ఛైర్మన్ ధనంజయరెడ్డి, ఆర్‌డిఒ రేణుక, జడ్‌పి సిఇఒ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.










