పారదర్శకంగా ప్రభుత్వ పథకాల లబ్ది అందించాలి
కలెక్టర్లను ఆదేశించిన సిఎం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
ప్రభుత్వ పథకాల లబ్ధి అర్హులైన పేదలందరికీ పారదర్శకంగా అందేలా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జేసిలతో స్పందన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కేటాయించిన నిధులపై సుదీర్ఘంగా చర్చించారు. పల్లెలు, పట్టణాల్లో ఎమ్మెల్యేలు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన తరువాత నెలరోజుల్లో ప్రాధాన్యత ప్రకారం పనులు మొదలుపెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డిసెంబర్ 21 నాటికి ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఓపి (స్థిరమైన అభివద్ధి లక్ష్యాలు)పై జిల్లా కలెక్టర్ లు ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. జగనన్న భూహక్కు - భూరక్ష వచ్చే నెలలో ప్రారంభం కానుందని, రానున్న 90రోజుల్లో పట్టాల కార్యక్రమం పూర్తికావాలని ఆయన ఆకాక్షించారు. లబ్దిదారుని ఫోటోతో భూహక్కు పట్టాలు పంపిణీ చేయనున్నందున ఎటువంటి తప్పులకు తావులేకుండా ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. అన్ని సమస్యలు సచివాలయాల పరిధిలోనే పరిష్కారం కావాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో 14,400 ఏ.సి.బి నెంబరును కనిపించే విధంగా బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రతి విశ్వవిద్యాలయం, కళాశాలల్లో దిశా యాప్ ఎన్రోల్మెంట్‌పై అవగాహన కల్పించాలన్నారు. అక్టోబర్ 26న రైతు భరోసా, ఇన్‌పుట్ సబ్సిడీని, నవంబర్ 10న వసతి దీవెన అందిస్తామని వివరించారు. నవరత్నాల్లో భాగంగా చేపట్టిన పేదలందరికి ఇల్లు నిర్మాణాలు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. ప్రతి గహానికి తాగునీరు, విద్యుత్, మురుగునీటి కాల్వల సదుపాయంతో పాటు మంచి రంగులు వేయాలని సూచించారు. ప్రతి జగనన్న కాలనీకి స్వాగతం పలికే ఆర్చ్ ఉండాలని, దాన్ని చూడగానే మంచి అభిప్రాయం లబ్ధిదారులకు కలిగేలా ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ ఈ - క్రాపింగ్‌పై, ఇళ్ల స్థలాలు, జగనన్న గహ నిర్మాణ పథకం, టిడ్కో ఇళ్లపై కలెక్టర్ లకు దిశా నిర్దేశం చేశారు. అదేవిధంగా 'స్పందన'కు వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష చేశారు. అంతేకాకుండా జాతీయ రహదారులకు కావాల్సిన భూ సేకరణపై, వైయస్‌ఆర్ అర్బన్, విలేజ్ క్లినిక్స్‌పై దిశానిర్దేశం చేశారు. చిత్తూరు నుంచి ఈవీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్, ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి, హౌసింగ్ పిడి పద్మనాభం, డిప్యూటీ సీఈవో ఆదిశేషారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్‌ఇ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకష్ణ, సిపిఓ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.










